పవన్ కు రక్షణ కవచంగా లోకేశ్.. టీడీపీ ముందుజాగ్రత్త


ఏపీ రాజకీయాల్లో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు.. తీవ్ర ఆరోపణలు మామూలే. అయితే.. ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు ఎలాంటి స్పందన ఉంటుందన్నది చాలా ముఖ్యం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి సాధించిన చారిత్రక విజయం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఒక మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఆయన టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేశారే తప్పించి.. జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయటం మానేశారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణలో పలువురు.. పవన్ పై మోతాదు మించిన రీతిలో జగన్ చేసిన విమర్శలు కూడా వైసీపీ దారుణ పరాజయానికి కారణమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ ను అనవసరంగా టార్గెట్ చేసినట్లుగా ప్రజలు భావించారన్న మాట వినిపించింది. ఇలాంటి వేళ.. పవన్ ను వదిలేసి.. చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తే బాగుంటుందన్న సూచన తెర మీదకు వచ్చింది.

వీటిని గుర్తించినట్లుగా జగన్ వైఖరి మారింది. పాలనకు సంబంధించి చంద్రబాబును విమర్శిస్తున్న జగన్.. పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసింది లేదు. అందుకు భిన్నంగా తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆ మనిషి కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ పవన్ ను ఉద్దేశించి సంచలన విమర్శలు చేశారు. దీనిపై జనసైనికులు భగ్గుమన్నారు. అది సహజం.. దీనికి భిన్నంగా ఇక్కడే మరో ఇంట్రస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. దాని గురించి చెప్పుకునే ముందు కాస్త ప్లాష్ బ్యాక్ కు వెళితే.. విషయం ఇట్టే అర్థం కావటంతో పాటు.. దాని అసలు ప్రాధాన్యత అర్థమవుతుంది.

2014 ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీ.. జనసేన కూటమి బరిలో దిగటం.. రెండు పార్టీలు పోటీ చేయగా.. జనసేన మాత్రం పోటీకి దూరంగా ఉంటూ మద్దతు ఇవ్వటం తెలిసిందే. ఆ ప్రభుత్వంలో పవన్ భాగస్వామిగా లేరు. కానీ.. ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి తప్పులు జరిగినట్లుగా గుర్తించినప్పుడు మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేసేవారు. దీనికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ నేతలు పవన్ ను విమర్శించేవారు. అంతేకాదు.. వైసీపీ నేతలు పవన్ ను టార్గెట్ చేసినప్పుడు.. మౌనంగా ఉండేవారు తప్పించి ప్రతిదాడి చేసేవారు కాదు.

మిత్రపక్షంగా ఉండి.. ప్రభుత్వానికి దన్నుగా నిలిచిన తమ నాయకుడ్ని లక్ష్యంగా చేసుకున్న వేళలోనూ తెలుగు తమ్ముళ్లు మౌనంగా ఉండటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తింది. చివరకు అదో సమస్యగా మారటం.. రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచేలా చేసింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి తలెత్తకూడదన్నట్లుగా టీడీపీ తీరు ఉంది. గతానికి భిన్నంగా పవన్ మీద జగన్ సంచలన వ్యాఖ్యలు చేసినంతనే జనసేన నేతలు స్పందించారు.

కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువన్న జగన్ కు వ్యాఖ్యలకు అంతే ధీటుగా స్పందించారు జనసేన ముఖ్యనేత కం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువన్న ఆయన అంటే.. అనూహ్య రీతిలో టీడీపీ కీలక నేత కం రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్వయంగా స్పందించారు. పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు తప్పన్న ఆయన.. ఓటమితో జగన్ ఫస్ట్రేషన్ లో ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒప్పుకోమంటూ మండిపడ్డారు.

ఇదంతా చూస్తే.. పవన్ విషయంలో తెలుగుదేశం పార్టీ కేర్ ఫుల్ గా ఉండటమే కాదు.. ఆయన మీద ఈగ వాలినా తాము ఒప్పుకోమన్న సంకేతాన్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. లోకేశ్ రంగంలోకి దిగటం ద్వారా పవన్ మీద చేసిన వ్యాఖ్యల్ని మిగిలిన తెలుగు తమ్ముళ్లు కూడా ఖండించాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చెబుతున్నారు. గతంలో పవన్ మీద విమర్శలు చేస్తే తెలుగు తమ్ముళ్లు స్పందించలేదన్న విషయం తమకింకా గుర్తు ఉందన్న విషయాన్ని చేతలతో చెబుతున్నారని చెప్పక తప్పదు.