ప్రభుత్వాన్ని ప్రశ్నించడం.. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని నిలదీయడం.. వంటివి ప్రతిపక్షంగా చేయాల్సిన పని! దీనిని ఎవరూ తప్పుబట్టరు. అయితే.. ఏ అంశానికైనా.. ఒక వేదిక
అంటూ.. ఉంటుంది. మూడు ముళ్లే కదా.. అని నాలుగు గోడల మధ్య పెళ్లి తంతు ముగిస్తారా? అలానే.. ఏ విషయానికైనా ఒక వేదిక అంటూ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వేదిక నుంచే మాట్లాడాలి.. ఆ వేదిక నుంచే ప్రశ్నించాలి. ఇదీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్ గురించి వినిపిస్తున్న టాక్.
తాజాగా మీడియాతో మాట్లాడిన జగన్.. తన తాడేపల్లి నివాసానికే ఎంపిక చేసిన మీడియా మిత్రులను ఆహ్వానించారు. అంతేకాదు.. పెన్ను.. పేపరు తప్ప.. ఎలాంటి వీడియోలు తీసుకురాకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలనే ఇప్పుడు కూడా వల్లె వేశారు. తామే వీడియో తీసి ఇస్తామని ప్రకటించారు. అదే పని చేశారు. ఇక, సుదీర్ఘంగా ఓ గంట సేపు మీడియాతో మాట్లాడిన జగన్.. తాజాగా కూటమి సర్కారు ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు.. ఆ ఊసు ఇప్పుడేదన్నారు. నిరుద్యోగులకు రూ.3000 చొప్పున భృతి ఇస్తామన్నా.. ఇప్పుడు ఏమైందని నిలదీశారు. అదేవిధంగా మహిళా శక్తి పేరుతో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందని చంద్రబాబును నిలదీశారు. అదేసమయంలో వైసీపీ పాలనలో జరిగిన మేళ్ల
ను కూడా జగన్ వల్లె వేశారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని తల్లులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని.. ఉచిత బస్సు కోసం మహిళలు వేచి ఉన్నారని చెప్పుకొచ్చారు.
కట్ చేస్తే.. జగన్ చెప్పినవి.. ఆయన సంధించినవి కూడా బాగానే ఉన్నాయని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, ఇవన్నీ.. బాత్ రూంలో కూర్చుని కూనిరాగాలు తీసినట్టుగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. సరైన వేదిక కళ్ల ముందే ఉందని అసెంబ్లీకి వెళ్లి వీటినే ప్రశ్నించాలని చాలా మంది వ్యాఖ్యానించడం గమనార్హం. మరికొందరు.. సభలో సమయం ఇవ్వకపోతే.. ఇవే విషయాలను అసెంబ్లీ మీడియా పాయింట్‌లోనే చెప్పుకోవచ్చు కదా! అప్పుడు మీ నిజమైన ప్రజాప్రేమ అందరికీ తెలుస్తుందని పెదవివిరిచారు. సో.. ఇదీసంగతి!!