మీనాక్షి మార్కు!.. 3 వర్గాలుగా టీ కాంగీయులు!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీలో ఒకింత ఈజీనెస్ కనిపిస్తోంది. కొందరు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు పార్టీ నియమావళిని పాటిస్తున్న నేతలు చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. వీరిలో పార్టీ సీనియర్లు ఉన్నారు… జూనియర్లూ ఉన్నారు. ఎవరూ ఇందుకు మినహాయింపు కాదు. పాత కాపులు కట్టు దాటుతున్నారు. కొత్త కాపులూ ఇష్టారాజ్యం అంటున్నారు. ఇలాగైతే కుదరదంటూ పార్టీ అధిష్ఠానం అప్పటిదాకా పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న దీపా దాస్ మున్షీని తప్పించింది. ఆమె స్థానంలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను నియమించింది. వచ్చీ రావడంతోనే ఇక్కడే మకాం వేసిన మీనాక్షి పార్టీలో తనదైన మార్కును చూపుతున్నారు. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం అయితే దేశ రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్న వాదన వినిపిస్తోంది.

అయినా మీనాక్షి ఏం చేశారన్న విషయానికి వస్తే… పార్టీ రాష్ట్ర శాఖలో ఉన్న అన్ని స్థాయిల నేతలను ఆమె మూడు వర్గాలుగా విభజించారు. ఆది నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలను తొలి వర్గంగా గుర్తించిన మీనాక్షి… వారిని సిసలైన పార్టీ నేతలుగా గుర్తించినట్లు సమాచారం. ఇక రెండో విభాగంలో… 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని చేర్చారు. వీరిలోనూ ఓ స్థాయి వరకు కేటగరైజేషన్ ను అంతగా పట్టించుకోని మీనాక్షి… జిల్లా స్థాయి, ఎమ్మెల్యే స్థాయి నేతల నుంచి ఆ పై స్థాయి వరకు ఏఏ కారణాలతో ఆయా నేతలు పార్టీలో చేరారన్న వివరాలను నమోదు చేస్తున్నారట. ఇక మూడో విభాగం కింద… పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరత పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలను చేర్చారట. ఈ విభాగంలో ఆయా నేతల చేరికలకు గల కారణాలు తదితరాలను కూడా మీనాక్షి నోట్ చేశారట.

నిజమే..మరి ఇలా ఈ తరహాలో పార్టీ నేతలను మూడు వర్గాలుగా కేటాయించిన అదిష్ఠానాన్ని ఏ పార్టీలో..ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని.. తన వర్కింగ్ స్టైల్ మాత్రం ఇదేనని తెగేసి చెబుతున్న మీనాక్షి… తాను అనుకున్నట్లుగా ఈ విభాగాల వర్గీకరణను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా సమాచారం. అయినా ఇప్పుడు దీని అవసరం ఏమిటంటారా?… పార్టీ అధికారంలో ఉంది కాబట్టి… త్వరలోనే ఖాళీగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాల్సి ఉంది. అలాగే తరచూ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్తానిక సంస్థల ఎన్నికలు వస్తే..ఆయా పదవులకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అంతిమంగా తదుపరి ఎన్నికల్లో సీట్లను కేటాయించాలి. ఇవన్నీ కూడా ఈ విభాగాల వర్గీకరణ ఆధారంగానే జరగనున్నాయట. దీంతో.. ఈ వర్గీకరణ మంత్రంపై పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.