ఏపీ మాజీ సీఎం, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే జగన్ వ్యవహార శైలిపై కూటమి నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి విమర్శలకు తగ్గట్లుగానే జగన్ కూడా దొంగలు పడ్డ ఆరు నెలలకు … బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరు రోజులకు స్పందించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి పరోక్షం, ప్రత్యక్షంగా ఎటువంటి సాయం చేయకూడదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇలా మాట్లాడడం ఏమిటని జగన్ మండిపడ్డారు.
వైసీపీ వాళ్లకు పథకాలివ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా అంటూ జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జడ్జిలు, గవర్నర్ చూడాలని జగన్ కోరారు. అంతేకాదు, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి సీఎంగా ఉండేందుకు అనర్హుడని, రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆత్మస్తుతి – పరనింద అన్నరీతిలో బడ్జెట్ ఉందని జగన్ అన్నారు. కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్నట్లు బడ్జెట్ ఉందని సెటైర్లు వేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై కూటమి నేతల దగ్గర సమాధానం లేదని అన్నారు. మొదటి బడ్జెట్‌లో ఆ హామీలకు బోడి సున్నా కేటాయించారని, రెండో బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు చేశారని ఆరోపించారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పించామని గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం సిగ్గుచేటన్నారు.
సూపర్ సిక్స్ అని కల్లబొల్లి కబుర్లు చెప్పారని, ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల నిరుద్యోగ భృతి కోసం రూ.7,200 కోట్లు అవసరమైతే, బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించలేదని విమర్శించారు. ఇక, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు. రాయలసీమ మహిళలు చంద్రబాబు ఫ్రీ బస్సు పథకం ఉపయోగించుకొని ఆయన కడుతున్న అమరావతిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని రెడీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.