ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు… అధికారిక ప్రకటన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పార్టీ కోసం, ఎన్నికల్లో జనసేన విజయం కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నాగబాబును ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా చేసేందుకు సీఎం చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోతోన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు పేరును జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.

ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని పవన్ ఆదేశించారు. అంతేకాదు, నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకారం జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో, త్వరలోనే నాగబాబు ఏపీ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక్క స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది.

వాస్తవానికి నాగబాబును రాజ్యసభకు పంపుతారని గతంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీగా నాగబాబును పవన్ ఖరారు చేస్తారని టాక్ వచ్చింది. ఇక, ఇవన్నీ కాదు నాగబాబుకు కీలకమైన కార్పొరేషన్ పదవి ఇస్తారని ఇంకో పుకారు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి నాగబాబుకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఇక, అఫీషియల్ గా ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేయడంతో నాగబాబు శాసన మండలిలో అడుగుపెట్టడం ఖాయం అయింది. జనసేనకు ఉన్న సంఖ్యాబలం ప్రకారం నాగబాబు ఎంపిక లాంఛనమే.