ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల యుద్ధంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే తిష్ఠవేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ చేపడుతున్న బనకచర్ల(కర్నూలు జిల్లా) ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు. దీనిని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల తమకు నీరు తగ్గిపోతుందని.. కాబట్టి ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని ఆయన కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌కు విన్నవించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించడం గమనార్హం. దీనికితోడు పలువురు తెలంగాణ మంత్రులు కూడా ఏపీ జలవనరులపై విమర్శలు చేశారు.
ఆయా అంశాలపై గత రెండు రోజులుగా మౌనం వహించిన ఏపీ ప్రభుత్వం తాజాగా స్పందించింది. మంగళవారం రాత్రి సీఎం చంద్ర బాబు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులను ఉద్దేశించి ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘సముద్రంలోకి వృథాగా పోయే నీటిని మేం వాడుకుంటే మీకు నొప్పేంటి?’ అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు.. “మీరు కావాలంటే వాడుకోండి. కానీ, సముద్రంలోకి వృథాగా పోతే చూస్తూ ఊరుకుంటారా? వృథా జలాలను తరలించి.. వాడుకుంటే తప్పేంటి? అవసరమైతే.. మీరూ వాడుకోవచ్చు. సముద్రంలో పోతున్న జలాలను కరువు పీడిత ప్రాంతాలకు తరలిస్తామని చెబితే.. కొందరు బాధపడిపోతున్నారు(రేవంత్ సహా మంత్రులు)” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అందరూ బాగుండాలి!
ఏపీ ప్రజలు, ఏపీ ప్రభుత్వం కూడా.. తెలుగు వారు ఎక్కడున్న బాగుండాలని కోరుకుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినప్పుడు కూడా తాము మాట్లాడలేదన్నారు. కాళేశ్వరాన్ని కట్టి మంచి పనిచేశారని ఆనాడు భావించినట్టు తెలిపారు. గోదావరి నది ఒక్కటే తెలుగు వారికి జల ప్రదాయనిగా ఉందన్న సీఎం.. ఈ నదిపై ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవాలని తెలంగాణకు సూచించారు. బనకచర్ల ప్రాజెక్టును నిర్మించడం ద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని కరువు ప్రాంతాలకు తరలించాలన్నదే తమ అభిప్రాయమని.. ఎవరినీ ముంచాలన్నది తమ ఉద్దేశం కాదని తేల్చి చెప్పారు. దీనికి ఎందుకో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.
రెండూ.. రెండు కళ్లు!
“ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అని నేనే గతంలోనే చెప్పా. ఇప్పుడు కూడా అదే మాటకు నిలబడుతున్నా. రెండు రాష్ట్రాల తెలుగు వారు బాగుండాలన్నదే మా విధానం. మీరూ నీటిని వాడుకోండి. మేమూ వాడుకుంటాం. తెలుగువారు ఎక్కడున్నా బాగుంటారు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల నీటిని ఏపీ తీసేసుకుంటోందని చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ తెలంగాణకు అన్యాయం చేయాలని భావించడం లేదన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ కరువు ప్రాంతాలు ఉన్నాయని.. ఎవరు ముందుకు వచ్చినా మిగులుజలాలు, వృథా జలాలను వినియోగించుకుని రాష్ట్రాలను బాగు చేసుకుంటే బాగుంటుందని తేల్చి చెప్పారు. కాగా. దీనిపై తెలంగాణ ఎలా స్పందిస్తుందో చూడాలి.