ఏ పార్టీకైయినా..ఆ పార్టీని లీడ్ చేస్తున్న నేత విషయంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పార్టీని నడిపిస్తున్న వారి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది. సదరు నేత పార్టీని నడిపించడమే కాదు.. తన నియోజకవర్గంలో తాను ఎలా ఉన్నారనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ పరిశీలిస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఒకరు. టీడీపీఅధినేత చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో పట్టు కొనసాగిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తన నియోజకవర్గం పులివెందులలో విజయం సాధిస్తూనే ఉన్నారు. మరొకరికి ఛాన్స్ లేకుండా దూసుకుపోతున్నారు.
జనసేన అధినేత పవన్ విషయం దీనికి డిఫరెంట్ అనుకోండి. ఆయనకంటూ.. ఒక నియోజకవర్గం లేదు. సో.. ఇప్పుడు అందరి దృష్టి.. సాకేపైనే ఉంది. వాస్తవానికి వృత్తి రీత్యా డాక్టర్ అయిన శైలజానాథ్.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎస్సీ నియోజకవర్గమైన అనంతపురంలోని శింగనమల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దివంగత వైఎస్‌కు ప్రధాన అనుచరుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఎన్నికల్లోనూ వరుస విజయం దక్కించుకున్నారు. అయితే, తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన ఓటమి ప్రారంభమైంది. 2014, 2019 ఎన్నికల్లో వరుస ఓటములు సాకేపై ప్రభావం చూపించాయి.
వివాద రహితుడు, విద్యావంతుడు అయినా కూడా నియోజకవర్గంలో ఆశించిన విధంగా వ్యక్తిగత ఇమేజ్‌ను సొంతం చేసుకోలేక పోయారనేది ప్రధాన వాదన. సహజంగానే కాంగ్రెస్ నేతలకు ఉండే ఈ లోటు.. సాకేను కూడా వెంటాడింది. ఇక, ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ఇక్కడ దూకుడు చూపిస్తున్నారా? నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే లేదనే అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కిన జొన్నలగడ్డ పద్మావతి.. దూకుడు ఎక్కువగా ఉండడమే కారణంగా చెబుతున్నారు.
పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు పార్టీలోకి వచ్చినా.. చేర్చేసుకుంటున్నారు పద్మావతి.. టీడీపీ నుంచి కీలకమైన కుటుంబం యామినీ బాల, శమంతకమణిలను పార్టీలో చేర్చుకున్నారు. దీంతో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే.. కాంగ్రెస్‌కు ప్రధానంగా ఉన్న కేడర్‌ను సైతం తనవైపు తిప్పుకొన్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ దూకుడు కనిపించడం లేదు.
ఇక, సాకే శైలజానాథ్ కాంగ్రెస్ చీఫ్ అయ్యాక నియోజకవర్గంపై దృష్టి పెట్టడం లేదనే టాక్ వస్తోంది. రాష్ట్రంపై దృష్టి పెడుతున్నారని.. స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాటం చేయడం లేదని అంటున్నారు. ఈ పరిణామాలే సాకే దూకుడుకు కళ్లెం వేస్తున్నాయని.. చెబుతున్నారు. దీంతో సాకే తన సొంత నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోతున్నారని అంటున్నారు. మరి సాకే వ్యూహం ఏంటో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates