చంద్ర‌బాబు ‘గేమ్ ఛేంజ‌ర్’కు తెలంగాణ మోకాల‌డ్డు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న బ‌న‌క‌చ‌ర్ల‌(క‌ర్నూలు జిల్లాలో ఉంది) నీటి పారుద‌ల ప్రాజెక్టు వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయ దుమారానికి దారి తీస్తోంది. నాలుగు మాసాల కింద‌ట‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. బ‌న‌క‌చ‌ర్ల‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ ముఖ చిత్రం కూడా మారిపోతుందని.. బ‌న‌క‌చ‌ర్ల ఏపీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ప్రాజెక్టుగా నిలుస్తుంద‌ని కూడా.. సీఎం చెప్పారు. అంతేకాదు.. తాజాగా ప్ర‌క‌టించిన 2025-26 వార్షిక ఏపీ బ‌డ్జెట్‌లోనూ నిధుల కేటాయింపు అంశాన్ని ప్ర‌స్తావించారు.

ఈ ప్రాజెక్టుకు సుమారు 80 వేల కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. దీనికి సంబంధించిన డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టును కూడా.. కేంద్రానికి పంపించామ‌ని.. కేంద్రం ఓకే అంటే.. పనులు త్వ‌ర‌లోనే ప్రారంభం అవుతాయ‌ని 2029 నాటికి బ‌న‌క‌చ‌ర్ల అందుబాటులోకి వ‌స్తే.. క‌రువు పీడిత క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాలు స‌స్య‌శ్యామ‌లం అవుతాయ‌ని చెబుతున్నారు. దాదాపు 2 ల‌క్షల ఎక‌రాల్లో పంట‌లు పండే అవ‌కాశం ఉంద‌ని కూడా సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. తాజాగా తెలంగాణ ఈ ప్రాజ‌క్టుపైనా లొల్లి పెట్టింది. దీనిపై నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. బ‌న‌క చ‌ర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని ఆయ‌న నేరుగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి పాటిల్‌కు విన్న‌వించారు.

గ‌తంలో వైసీపీ చేప‌ట్టిన రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థకానికి కూడా.. అప్ప‌టి సీఎం కేసీఆర్ బ‌లంగా అడ్డుకున్నారు. అది కూడా ఇలానే అవాంత‌రాల గండంలో కునారిల్లుతోంది. ఇక‌, ఇప్పుడు ఏపీకి గేమ్ చేంజ‌ర్‌గా చెబుతున్న బ‌న‌క‌చ‌ర్ల ను కూడా తెలంగాణ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే.. గోదావ‌రి జిల్లాలు తెలంగాణ‌కు కాకుండా పోతాయ‌న్న‌ది సీఎం రేవంత్ రెడ్డి వాద‌న‌. వాస్త‌వానికి బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ద్వారా.. స‌ముద్రంలో క‌లుస్తున్న 200 టీఎంసీల జ‌లాల‌ను ఒడిసి ప‌ట్టి క‌రువు పీడిత ప్రాంతాల‌కు మ‌ళ్లించాల‌న్న‌ది ఏపీలోని కూట‌మి స‌ర్కారు వాద‌న‌.

కానీ, స‌ముద్రంలోకి పోవ‌డానికి ముందే.. తోడేసే ప్ర‌య‌త్నాలు చేస్తార‌న్న‌ది తెలంగాణ స‌ర్కారు వాద‌న‌. ఈ నేప‌థ్యంలోనే బ‌న‌క‌చ‌ర్ల‌పై కూడా గ‌తంలో రాయ‌ల‌సీమ ఎత్తిపోతల ప‌థ‌కానికి ప‌ట్టిన‌ట్టే రాజ‌కీయ గ్ర‌హ‌ణం ప‌డుతోంది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు డీపీఆర్ అంద‌లేద‌న్న కేంద్ర మంత్రి.. దీనిపై ఏపీతో చ‌ర్చిస్తాన‌ని చెప్పారు. గ‌తంలో ఇలానే.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పైనా చ‌ర్చిస్తాన‌ని..ఇరు ప‌క్షాలే తేల్చుకోవాల‌ని కేంద్రం లింకు పెట్టిన విష‌యం గ‌మ‌నార్హం. కానీ, అది ఎటూ తేలలేదు. ప్ర‌స్తుతం ప‌నులు ఆగిపోయాయి. మ‌రి బ‌న‌క‌చ‌ర్ల ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.