ఏపీ అసెంబ్లీలో బాబు, పవన్, జగన్ సీట్లు ఎక్కడంటే..?

ఏపీ అసెంబ్లీలో సీట్ల కేటాయింపు పూర్తి అయ్యింది. ఈ మేరకు సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు సీట్ట కేటాయింపునకు సంబంధించి ప్రకటన చేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయగా… వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. మూడు పార్టీల కూటమి ఏకంగా 164 సీట్లను కైవసం చేసుకోగా… వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు వైసీపీకి రాలేనందున… ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని అధికార కూటమి ఇప్పటికే కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

అయితే 11 సీట్లు వచ్చినా కూడా… సభలో విపక్షంలో తమ పార్టీ కాకుండా మరో పార్టీనే లేనందున వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కూడా ఆ పార్టీ పట్టుబడుతోంది. ఇదే కారణాన్ని చూపుతూ సమావేశాలకు రాబోమంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు లేకుండానే సభా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎవరు వచ్చినా… ఎవరు రాకున్నా… సభకు ఎన్నికైన సభ్యులకు సభలో సీట్ల కేటాయింపు జరిగిపోతుంది కదా. ఆ ప్రకారమే సభలో సీట్ల కేటాయింపును పూర్తి చేసిన డిప్యూటీ స్పీకర్… ఆ మేరకు ప్రకటన చేశారు.

డిప్యూటీ స్పీకర్ ప్రకటన మేరకు అధికార కూటమిలోని మంత్రి మండలిలో సభ్యులుగా ఉన్న వారిని ట్రెజరీ బెంచ్ గా పరిగణిస్తూ… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా జనసేన అదినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులకు ముందు వరుసలోనే సీట్ల కేటాయింపు జరిగింది. ఇందులో భాగంగా చంద్రబాబుకు ఒకటో నెంబరు సీటు దక్కగా… పవన్ కల్యాణ్ కు 39 నెంబరు సీటు దక్కింది. ఇక మంత్రుల వెనుక సీట్లను చీఫ్ విప్, విప్ లకు కేటాయించారు. వైసీపీ పక్ష నేత హోదాలో జగన్ కు విపక్ష బెంచ్ లలో తొలి వరుసలోనే సీటును కేటాయించారు.