తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్న రేవంత్ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ఇద్దరు బీజేపీ నేతలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రస్తావించిన ఆ ఇద్దరు బీజేపీ నేతల్లో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాగా… మరొకరు మోదీ కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్న తెలంగాణ నేత కిషన్ రెడ్డి కావడం గమనార్హం.
తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం వైఖరిని ప్రస్తావించిన రేవంత్.. ప్రధాని మోదీ తీరును ప్రశంసించారు. తెలంగాణ పట్ల మోదీ సానుభూతితో ఉన్నారని రేవంత్ అన్నారు. రాష్ట్రానికి అంతో ఇంతో చేయాలన్న బావనతోనే మోదీ ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వరంగల్ కు మోదీ ఎయిర్ పోర్టును ఇచ్చారని కూడా ఆయన అన్నారు. ఈ లెక్కన మోదీ తెలంగాణ పట్ల సానుకూలంగా ఉన్నట్లుగానే కనిపిస్తోందన్నారు. ఓ ప్రధానిగా మోదీ తెలంగాణ పట్ల సానుకూల వైఖరితో ఉండటం రాష్ట్రానికి ఎంతో మంచిదని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో తెలంగాణకు చెందిన నేతగా కిషన్ రెడ్డి…కేంద్ర మంత్రివర్గంలో ఉండి… రాష్ట్రానికి సైంధవుడిలా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. మోదీ రాష్ట్రానికి ఏదైనా చేయాలని ఉన్నా.. దానిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. వరంగల్ కు మోదీ ఎయిర్ పోర్టు మోదీ ఇస్తే.. దానిని తానే తీసుకువచ్చానని కిషన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. మోదీ రాష్ట్రం పట్ల సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి రాష్ట్రం పట్ల పగతో ఉన్నారని అన్నారు.
కిషన్ రెడ్డి, తాను గతంలో కొంతకాలం పాటు ఒకే చోట ఉన్నామని గుర్తు చేసుకున్న రేవంత్.. రాజకీయంగా తన ఎదుగుదలను కిషన్ రెడ్డ ఓర్వలేకపోతున్నారని ఆరోపిచారు. తనకంటే చిన్నవాడిని తన కంటే ముందుగా సీఎం అయ్యానని కిషన్ రెడ్డి ద్వేషం పెంచుకున్నారన్నారు. కేంద్రం నుంచి ఏదైనా వస్తే దానిని తన ఖాతాలో వేసుకుంటున్న కిషన్ రెడ్డి… రాని దానిని తనకు ఆపాదిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ కు ఎయిర్ పోర్టును తీసుకువచ్చిన కిషన్ రెడ్డి.. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు తదితరాలకు కూడా నిధులు ఎందుకు తీసుకుని రావడం లేదని ప్రశ్నించారు. మొత్తంగా మోదీని రాష్ట్రానికి మిత్రుడిగా అభివర్ణించిన రేవంత్.. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డిని శత్రువుగా పేర్కొనడం గమనార్హం.