2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఆ ఐదేళ్లు చేసిన తప్పులకు ఎన్నికల్లో భారీ మూల్యమే చెల్లించుకుంది. ఐతే తమకు తెలిసి జరిగిన తప్పులకు ప్రజలు ఆ శిక్ష వేస్తే.. తెలియని తప్పుల గురించి కూడా తెలిస్తే ఎలా స్పందించేవారో అని ఆశ్చర్యం కలగకమానదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరుగున పడ్డ ఎన్నో తప్పులు బయటికి వచ్చాయి.
తాజాగా మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్.. జగన్ సర్కారు చేసిన ఘోరమైన తప్పిదం ఒకటి బయటపెట్టారు. దేశవ్యాప్తంగా తాగునీటి సమస్యను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగాజల్ జీవన్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రాలకు వేల కోట్లు ఇస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే గత కొన్నేళ్లలో కలిపి ఈ పథకం కింద ఏకంగా రూ.14 వేల కోట్లు మంజూరు చేసిందట మోడీ సర్కారు. కానీ జగన్ సర్కారు అందులో ఎంతమేర వినియోగించుకుందో తెలిస్తే షాకవక తప్పదు.
కేవలం రూ.2200 కోట్ల మేర మాత్రమే ఈ పథకం కింద ఖర్చు చేసిందట జగన్ ప్రభుత్వం. ఏపీలో ఇంకా తాగునీరు అందని ప్రాంతాలు, గ్రామాలు బోలెడన్ని ఉన్నాయి. కేంద్రం అంత భారీ మొత్తంలో నిధులు ఇస్తుంటే.. మొత్తం రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చేయడానికి అవకాశముంది. కానీ జగన్ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోలేదు. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం ఈ నిధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మనోహర్ వెల్లడించారు.
నిజానికి మరి కొన్ని నెలల్లోనే ఈ పథకం గడువు ముగిసిపోయేదని, ఐతే పవన్‌తో పాటు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసి.. ఈ నిధులు తాము ఉపయోగించుకుంటామని.. రాష్ట్రంలో తాగునీరు అందాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయని.. పథకం గడువు పెంచేలా చూశారని మనోహర్ వెల్లడించారు. వారి విజ్ఞప్తిని మన్నించి రాష్ట్రంలో ఇంకో నాలుగేళ్లకు పథకాన్ని పొడిగించినట్లు మనోహర్ వెల్లడించారు.