రేవంత్ సర్కారుపై కోర్టుకెక్కిన అల్లు అర్జున్ మామ

కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎవరో తెలుసు కదా. ఇటీవలి పాన్ ఇండియా సెన్సేషన్ మూవీ పుష్ప హీరో అల్లు అర్జున్ మామ గారు. కంచర్ల కూతురే అల్లు అర్జున్ సతీమణి. అంతేనా తెలంగాణలో అదికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కీలక నేత. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లడం, అక్కడ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు గాయపడటం… ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. ఇలా వెంటవెంటనే జరిగిన పరిణామాలు కంచర్లను కాంగ్రెస్ కు ఒకింత దూరం చేశాయన్న వాదనలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఆ దూరం మరింతగా పెరిగే పరిణామం ఒకటి జరిగింది. హైదరాబాద్ లోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదురుగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్ పార్కు) విస్తరణను వ్యతిరేకిస్తూ కంచర్ల తాజాగా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్కు విస్తరణలో బాగంగా తన ఇంటికి నష్టం కలగని రీతిలో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కంచర్ల తన పిటిషన్ లో హైకోర్టును అభ్యర్థించారు. వాస్తవానికి ఈ రీతిన కోర్టుకెక్కిన వారిలో కంచర్లనే ప్రథములు కాదు. కంచర్ల మాదిరే ఇదివరకే ఓ నలుగురు వ్యక్తులు కేబీఆర్ పార్కు విస్తరణను వ్యతిరేకిస్తూ కోర్టుకు ఎక్కారు.వీరి పిటిషన్లు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. వాటికి ఇప్పుడు కంచర్ల పిటిషన్ అదనంగా జత అయ్యింది.

కేబీఆర్ పార్కు అనేది ఎవరు ఔనన్నా… ఎవరు కాదన్నా… హైదరాబాద్ లో అత్యంత ప్రాదాన్యం కలిగిన ప్రదేశమేనని చెప్పాలి. నిత్యం ఉదయం, సాయంత్రం వేళ ప్రముఖులతో పాటు సాధారణ జనం కూడా ఈ పార్కులో సేదదీరుతూ ఉంటారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ పార్కు మీదుగా ఫ్లై ఓవర్లు, పార్కు కింద అండర్ పాస్ లను ఏర్పాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కారు ఓ ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే కేబీఆర్ పార్కును ఈ ప్రణాళికలు ద్వంసం చేస్తాయని చాలా వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు పార్కును ఆనుకుని ఇళ్లు కట్టుకున్న కంచర్ల లాంటి ప్రముఖులు తమ ఇళ్లను కాపాడుకునే క్రమంలో ఏకంగా కోర్టుకే ఎక్కారు. మరి ఈ పిటిషన్లపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు గానీ… ఈ పిటిషన్ తో రేవంత్ కు కంచర్ల మరింత దూరమయ్యే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.