తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) వద్దకు వెళ్లనున్నారు. ఎల్ఎల్బీసీ సొరంగం పనుల్లో బాగంగా గత నెల 22న ప్రమాదం చోటుచేసుకోగా… సొరంగంలోకి వెళ్లిన చాలా మంది అప్పటికప్పుడు అప్రమత్తమై బయటకు వచ్చేయగా.. ఇద్దరు ఇంజినీర్లు సహా ఆరుగురు కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం జరిగి ఆదివారం నాటికి దాదాపుగా 9 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో సొరంగంలోకి చిక్కుకుపోయిన 8 మంది బ్రతికి ఉండే ఛాన్సే లేదని సమాచారం. 8 మంది కూడా బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే రోజున దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. రోజంతా అక్కడే ఉండి సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసే సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత నిత్యం ఉత్తమ్ అదే పని మీద ఉన్నారు. సొరంగం దాదాపుగా 14 కీలో మీటర్లకు పైగా ఉండటం… ఎక్కడికక్కడ నీరు జమ అయిపోతున్న నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ కారణంగానే బాధితులను బయటకు తీసుకురావడం కుదరట్లేదు. ఈ క్రమంలో ఉత్తమ్ తో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఇలాంటి సమయంలో మొన్న బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లి సహాయక చర్యలపై తమదైన శైలి విమర్శలు గుప్పించారు. ప్రమాదం జరిగి వారం దాటినా సీఎం ఇంకా ఇక్కడికి రానే లేదని వారు ఆరోపించారు. విపక్షాల ఆరోపణలనే కాదు గానీ… సహాయక చర్యలకు ఆటంకం కలిగించకూడదన్న భావనతోనే ఇప్పటిదాకా సీఎం అక్కడికి వెళ్లలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు తుది దశకు చేరుకున్న సమయంలో ఆదివారం దోమలపెంట వెళ్లేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆయన వనపర్తి నుంచి నేరుగా దోమలపెంట వెళ్లనున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించనున్న ఆయన… అక్కడే ఉన్నతాధికారులతో ఓ అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. ఈ సమీక్ష తర్వాత సహాయక చర్యలు మరింత ముమ్మరం కానున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.