వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజంపేట జైలులో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆయనను రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పోసానికి ఈసీజీ తీసి.. సదరు రిపోర్టులను పరిశీలించి… పోసాని గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని నిర్ధారించారు. అంతేకాకుండా బుధవారం రాత్రి ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం, గురువారం పగలంతా పోలీసుల విచారణ… అదే రోజు రాత్రంతా కోర్టులో వాదోపవాదాలు… తదనంతరం ఎప్పుడో శుక్రవారం ఉదయం ఆయనను జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన కొంతమేర అసౌకర్యానికి గురయ్యారని తేల్చారు. మరింత మెరుగైన వైద్యం అయితే పోసానికి అవసరమని సూచించారు. దీంతో పోలీసులు పోసానిని కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఇదిలా ఉంటే… వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ కీలక నేతలు చెప్పినట్లుగా… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటుగా వారి కుటుంబ సభ్యులపైనా పోసాని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసింది తానేనని… వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రాకమృష్నారెడ్డి ఆదేశాల మేరకే చేశారంటూ పోసాని ఒప్పుకున్న సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో నేరం చేసినట్లు పోసాని ఒప్పుకున్నట్టే కదా. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ కేసులో బెయిల్ లభించడం అసాధ్యమేనని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఈ కేసులో పోసాని బెయిల్ తీసుకుని బయటకు వస్తే… ఇవే ఆరోపణలకు సంబంధించి ఇంకో 14 కేసులు ఉన్నాయి. పోలీసులు కూడా ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా కాసుక్కూర్చుని ఉన్నారు.
ఇలాంటి నేపథ్యంలో కేసు నిజాలు, సాక్ష్యాలు, నిర్ధారణలతో సంబంధం లేకుండా… కేవలం అనారోగ్యంతో పోసానికి బెయిల్ లభిస్తే తప్పించి… ఆయన ఈ కేసులో బయటపడలేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పోసాని చాలాకాలంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం. పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలోనూ ఆయన పడిన ఆందోళనను చూస్తే కూడా ఆయన ఆరోగ్యపరంగా ఒకింత వీక్ గానే ఉన్నట్లు కనిపించింది. ఇక పోసానికి రోజూ మందులు తానే వేస్తానంటూ ఆయన సతీమణి పోలీసులకు చెప్పారు. ఇలా ఎన్ని కోణాల్లో చూసినా… పోసాని అయితే ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఒక్క అనారోగ్యం కారణంగానే పోసానికి ఈ కేసుల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇంకే రకంగానూ ఈ కేసుల నుంచి ఆయన బయటపడే ఛాన్సే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates