శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఓ ఘటన నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాల్లో తూటాల్లాంటి మాటలను పేల్చడమే కాకుండా… ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేయగల సత్తా కలిగిన ఓ పవర్ ఫుల్ నేతగానే జనానికి తెలిసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి… చిన్న పిల్లాడికి మల్లే వెక్కి వెక్కి ఏడ్చేసినంత పనిచేశారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆయన ఆపుకోలేకపోయారు. ఎంత ఆపుకుందామనుకున్నా… ఆగకుండా ధారగా కారుతున్న కన్నీటిని ఆయన చేతి రుమాలుతో తుడుచుకుంటూ తీవ్ర భావోద్వేగంలో ముగినిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.
అయినా జగదీశ్ రెడ్డిని అంతగా ఇబ్బందికి, భావోద్వేగానికి గురి చేసిన అంశం ఏమిటన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి. సూర్యాపేట జిల్లాకు చెందిన జగదీశ్ రెడ్డి శనివారం తన జిల్లా పరిధిలోనే పెన్ పహాడ్ మండలం చిన్న గారకుంట తండా, గాజుల మల్కాపురంలలో పర్యటించారు. ఈ సందర్భంగా సాగునీరు అందక ఎండిపోతున్న పచ్చని పొలాలు ఆయన కంటబడ్డాయి. ఎంతైనా జగదీశ్ రెడ్డి కూడా రైతు బిడ్డే కదా. కాల్వలు అందుబాటులో ఉన్నా… సాగు నీరందక పంటలు ఎండిపోతున్న వైనాన్ని చూపుతూ ప్రభుత్వాన్ని నిలదీద్దామన్న భావనతో ఆయన మీడియా ప్రతినిధులను కూడా పిలిచారు. మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమైన సందర్భంగా ఒక్కసారిగా జగదీశ్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక… సాగు నీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున నిర్మాణం జరిగింది. ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కూడా భారీగానే పెరిగింది. గడచిన పదేళ్ల పాటు కేసీఆర్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి… బీఆర్ఎస్ పాలనలో రైతులకు న్యాయం జరిగిందని వాదిస్తారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. కాలువలు ఉన్నా నీటి లభ్యత లేకుండా పోయిందని గత కొంత కాలంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఎలాంటి పచ్చని పంట పొలాలు… ఇలా నీళ్లు లేక ఎండిపోతున్న వైనాన్ని చూసి తట్టుకోలేక జగదీశ్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారని చెప్పాలి.