ఏపీలో ఆ రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా?: రేవంత్ రెడ్డి

ఏపీలో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, అక్కడ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కిషన్ రెడ్డి చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? అక్కడ మాదిగలకు ద్రోహం చేయడం లేదా? అని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ సమావేశం సందర్భంగా రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని, ఆయన వల్లే మూసీ, మెట్రో ప్రాజెక్టులు ఆగిపోయాయని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలను కల్పించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని ఇల్లు మంజూరు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోతారని కులగణనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు తెలంగాణ కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న పనుల్లో పావలా శాతం కూడా రాష్ట్రానికి రావడంలేదని ఆరోపించారు.

టీపీసీసీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. మంచి విషయం మైక్ లో చెప్పాలని, చెడు విషయం చెవిలో చెప్పాలని రేవంత్ అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు భిన్నంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి మరో విడతలో తప్పకుండా పదవులు వస్తాయని చెప్పారు. అదే విధంగా కష్టపడని వారిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు.