ఎనుముల రేవంత్ రెడ్డి రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో ఓ ఊపు వచ్చింది. కాంగ్రెస్ కు ఇక అందదనుకున్న తెలంగాణ అధికారం అందివచ్చింది. గ్రాటిట్యూడ్ గా రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. తెలంగాణ సీఎంగా రేవంత్ అప్పుడే ఏడాది పాలనను కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడప్పుడే రేవంత్ రెడ్డి నుంచి సీఎం సీటు చేజారుతుందన్న భావన అస్సలే వినిపించట్లేదు. సీఎం పోస్టు దక్కిందంటే… ఏ రాజకీయ నేతకు అయినా ఇక చాలబ్బా అనేంత సంతృప్తి. ఒక్క ప్రధాన మంత్రి పదవి తప్పించి.. ఏ పదవి కూడా దానికంటే తృప్తిని ఇవ్వదు. ఈ లెక్కన సీఎం పోస్టులో కూర్చుంటే అల్టిమేట్ గా సంతృప్తి దక్కినట్లే కదా.
మరేంటి సీఎంగా ఉన్నా తనకూ అసంతృప్తి ఉండదా? అంటూ స్వయంగా రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సందర్భంగా రేవంత్ నోట ఈ మాటే వచ్చింది. సీఎంగా ఉన్న తానేమీ అంతగా సంతృప్తిగా లేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గానీ… ప్రభుత్వంలో గానీ అంతా తాను చెప్పినట్టే నడవాలని తనకు లేకున్నా… కూడా తనకు అసంతృప్తి లేకపోలేదని వ్యాఖ్యానించి ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టేసిన రేవంత్… తన అసంతృప్తికి అసలు సిసలు కారణాలు అయితే చెప్పలేదు గానీ… తనలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని చెప్పకనే చెప్పేశారు. ”వేణు అన్నను పొద్దున రమ్మంటే… ఆయనేమో సాయంత్రానికి గానీ రావడం లేదు. నేను ఢిల్లీకి వెళితే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారు. నేను హైదరాబాద్ వస్తే…ఆయనేమో ఢిల్లీ వెళ్లిపోతున్నారు. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మంచిని మైకులో చెప్పాలి.. చెడును చెవిలో చెప్పాలి. అయితే మనోళ్లేమో మంచిని చెవిలో చెబుతున్నారు. చెడును మైకులో గట్టిగా చాటింపేస్తున్నారు.” అంటూ ఆయన సోదాహరణంగా చెప్పుకుంటూ పోయారు.
ఇలా సాగిపోయిన రేవంత్… తాను చెప్పదలచుకున్నది అయిపోయిందని భావించారో… లేదంటే… ఇక ఈ రోజుకు ఇది చాల్లే అని భావించారో తెలియదు గానీ… ఆ తర్వాత కవరింగ్ యత్నాలు చేశారు. తనలోని అసంతృప్తిని కవర్ చేసుకునేందుకు యత్నించిన రేవంత్… ఇవన్నీ పెద్ద సమస్యలు కాదని, రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేసుకునే దిశగా అందరం కలిసి సాగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ నేతలు సీనియర్లు, సీనియర్ మోస్ట్ లే ఉన్నారు. వారితో పోలిస్తే.. పార్టీలో రేవంత్ చాలా జూనియర్ కిందే లెక్క. తమ కంటే చాలా లేట్ గా వచ్చి కూడా రేవంత్ సీటును ఎగురవేసుకుపోయారని కొందరు భావిస్తూ ఉండవచ్చు గానీ.. రేవంత్ వచ్చాకే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని వారంతా గుర్తించలన్నది రేవంత్ వర్గం వాదనగా వినిపిస్తోంది.