రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీన అందించే సామాజిక భద్రతా పింఛన్-ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌పై సీఎం చంద్రబాబు వినూత్న ఐడియా ప్లే చేస్తున్నారు. ఇది మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. పింఛను దారులకు సీఎం సందేశం ఇవ్వనున్నారు. పేరు పేరునా.. ఈ సందేశం వినిపించడం గమనార్హం. అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ప్రస్తుతం పింఛను తీసుకునేవారు… వేలి ముద్ర వేసి.. సొమ్ములు అందుకుంటున్నారు.
సామాజిక భద్రతా పింఛన్లు మొత్తం 5 రకాలుగా ఉన్నాయి. వితంతు, వృద్ధులు, దివ్యాంగులు, లెప్రజీ, కిడ్నీ సహా ఇతర బాధితులకు పింఛన్లు ఇస్తున్నారు. అయితే.. వీరంతా వేలిముద్ర వేసిన వెంటనే సంబంధించి వార్డు లేదా గ్రామ సచివాలయ సెక్రటరీ నగదు ఇచ్చి వెళ్లిపోతున్నారు. అయితే.. ప్రభుత్వం ఈ పింఛన్లు ఇచ్చేందుకు ఎంత కృషి చేస్తోందో.. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతోందో.. ప్రజలకు వివరించాలని.. ప్రజల మేలు కోసం చేస్తున్న విషయాలను వారి చెవిన పడాలని సర్కారు భావిస్తోంది.
ఈ నేపథ్యంలో స్వయంగా చంద్రబాబు వాయిస్‌తోకూడి ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆడియోను మార్చి 1 నుంచి ప్రవేశ పెట్టనున్నారు. తద్వారా.. 20 సెకన్ల పాటు ఆ ఆడియో వినిపించనుం ది. అది కూడా.. సామాజిక భద్రతా పింఛను దారు.. వేలి ముద్ర వేసిన వెంటనే సదరు లబ్ది దారుని పేరుతో సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడినట్టుగా ప్లే చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛను పెంచిన నేపథ్యంలో.. జరుగుతున్న లబ్ధి, ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఇస్తున్న సొమ్ముల వివరాలను ఆ ఆడియోలో ప్లే చేయనున్నారు.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. వేలి ముద్ర వేసిన తర్వాత.. వెంటనే గతంలో లబ్ధిదారులకు పింఛను ఇచ్చేందుకు సక్సెస్ లేదా యాక్సప్ట్ అనే సందేశాలు వచ్చేవి. దీంతో సదరు సెక్రటరీ సొమ్ములు చేతిలో పెట్టి వెళ్లిపోయేవారు. కానీ, తాజాగా చేసుకున్న మార్పతో.. వేలి ముద్ర వేసిన తర్వాత.. 20 సెకనుల పాటు.. సందేశం వినిపిస్తుంది. దీనిని పూర్తిగా విని ధ్రువీకరించుకున్న తర్వాత..(అంటే ఈ సందేశం విన్నామని పేర్కొంటూ.. రెండోసారి కూడా వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. ) మాత్రమే పింఛను సొమ్ము ఇచ్చేందుకు యాక్సప్ట్ చేయనుంది. దీనిని ప్రస్తుతం మార్చి 1 నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ప్రవేశ పెట్టనున్నారు. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.