ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న పథకాలు, కార్యక్రమాలకు తోడు కొత్తగా మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆయా కార్యక్రమాలకు నిధుల కేటాయింపు భారమే అయినప్పటికీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలను అందిపుచ్చుకోనున్నట్టు ఆయన చెప్పారు. వీటి ద్వారా మరింత స్వావలంబన దిశగా రాష్ట్రాన్ని నడిపించనున్నట్టు ఆయన తెలిపారు.
పాఠశాలలకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్‌ను అందించే కార్యక్రమాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 92000 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక, మధ్యమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటికీ వచ్చే ఏడాది నుంచి ఉచితంగా విద్యుత్ అందనుందని మంత్రి చెప్పారు. అయితే.. కేంద్రం అమలు చేస్తున్న సూర్యఘర్ యోజనను ఈ పాఠశాలలకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందనుంది.
తొలిసారిగా భాషాభివృద్ధికి నిధుల కేటాయింపు
రాష్ట్రంలో తొలిసారి ప్రాంతీయ భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తెలుగు భాషాభి వృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. తెలుగు భాషను కాపాడుకోవడం.. ముందు తరాలకు ఈ భాషను అందించడం.. మన కర్తవ్యంగా పేర్కొన్న పయ్యావుల.. అన్ని దశల్లోనూ తెలుగును అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం తెలుగుకు పాతర వేసే పనులు చేపట్టిందని.. తెలుగు మీడియంను రద్దు చేసి.. ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టి.. విద్యావ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు. అయితే.. తాము తెలుగుతో పాటు ఇంగ్లీషుకు కూడా సమాంతర ప్రాధాన్యం ఇస్తామని పయ్యావుల ప్రకటించారు.