“చిన్న చిన్న కష్టాలు ఉంటే సర్దుకుంటాయి. వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. మేం కలిసే ఉంటాం.. విడిపోం!” అంటూ అసెంబ్లీ వేదికగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో తాము అధికారంలోనే ఉంటామని కూడా ఆయన చెప్పారు. ఈ పరిణామాలపై రాష్ట్రంలోని రాజకీయ నేతల మధ్య చర్చసాగింది. 2024 ఎన్నికలకు ముందు కాపు, కమ్మ సమాజాన్ని ఏకం చేయడం ద్వారా మెజారిటీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంతో ఈ కూటమి సక్సెస్ అయింది.
అయితే.. దీనిని రక్తికట్టించకుండా అడ్డుకునేందుకు వైసీపీ అనేక వ్యూహ ప్రతివ్యూహాలు వేసింది. కాపు నాయకుల ద్వారానే కాగల కార్యం.. అన్నట్టుగా వ్యవహరించినా.. సక్సెస్ కాలేదు. ఇక, ఇప్పుడు వైసీపీ అధినేత జగన్.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని.. ఇది తమకుసానుకూలంగా మారుతుందని చెప్పుకొచ్చారు. అయితే.. దీనికి ఆలంబనగా.. క్షేత్రస్థాయిలో జనసేనకు, టీడీపీ నేతలకు మధ్య జరుగుతున్న వివాదాలు కారణం కావొచ్చన్న చర్చ ఉంది. కానీ, దీనిని జనసేన అధినేత లైట్ తీసుకుంటున్నారనే విషయం తాజాగా స్పష్టమైంది.
ఎన్ని వివాదాలు వచ్చినా.. జనసేన – టీడీపీ కూటమి విడిపోదన్న సంకేతాలు బలంగా ఇచ్చారు. ఇదే వాస్తవం అయితే.. భవిష్యతులో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. సామాజిక వర్గాల పరంగా ఉన్న బలాన్ని ఏకం చేసే అవకాశం మెండుగానే ఉంటుంది. నిజానికి జగన్ చెబుతున్నట్టుగా క్షేత్రస్థాయిలో కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య చిన్నపాటి వివాదాలు , విభేదాలు ఉన్నప్పటికీ.. ఓటు బ్యాంకు రాజకీయాలకు వచ్చే సరికి.. కమ్మలు చంద్రబాబును వదులుకునే అవసరం, అవకాశం లేదు. అదేసమయంలో కాపులు పవన్ కల్యాణ్‌ను వదులుకునే సాహసం చేయబోరన్నది వాస్తవం.
ఈ నేపథ్యంలో ఓటర్లు క్షేత్రస్థాయి నాయకుల కంటే కూడా.. హెడ్ ట్యాంకును నమ్ముకున్నట్టుగా అగ్రనేతలను నమ్ముకునే అవకాశం మెండుగా ఉంటుంది. దీనిని ఊహించే పవన్ కల్యాణ్ ఈ ప్రకటన చేసి ఉంటారు. సహజంగా.. పార్టీలో విభేదాలు ఇప్పుడు కొత్తకాదు. గతంలోనూ ఎన్నికలకు ముందు అనేక మంది టికెట్ల విషయంలో వివాదానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో మనకు బలం లేదు.. అంటూ.. వారిని పవన్ కల్యాణ్ అనునయించారు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి.. ప్రస్తుతం ఉన్న బలాన్నిచూపించి.. ఆయన నాయకులు, కార్యకర్తలను లైన్‌లో పెట్టుకునే అవకాశం ఉంది తప్ప.. వైసీపీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates