గడచిన కొన్ని రోజులుగా తెలుగు మీడియా సర్కిళ్లలో ఓ అంశం మీద ఆసక్తికర చర్చ నడుస్తోంఃది. టీడీపీ అనుకూల మీడియాగా ముద్ర పడిన ఏబీఎన్ ఆంధ్రజ్మోతి ఛానెల్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు పర్వతనేని వెంకట కృష్ణ ఆ ఛానెల్ నుంచి తప్పుకున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు ఏబీఎన్ గానీ, ఇటు రాదాకృష్ణ గానీ నోరు మెదపలేదు. వాస్తవంగా ఇది వారి వ్యక్తిగత, సొంత వ్యవహారం కాబట్టి… వారు దీనిని బయటపెట్టాల్సిన అవసరం కూడా లేదు గానీ… ఓ ప్రముఖ మీడియా, అందులో పనిచేసే ఓ ప్రముఖ జర్నలిస్టు వ్యవహారం కావడంతో ఈ విషయంపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది.
ఏబీఎన్ లో డీబేట్ పేరిట జరిగే చర్చా కార్యక్రమం ఆ ఛానెల్ కు హైలెట్ ప్రోగ్రామే. ఈ ప్రోగ్రాంను వెంకటకృష్ణ నడిపిన తీరు కూడా అమోఘమనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల ద్వారా ఆయా విషయాలను రాబట్టడంలో వెంకట కృష్ణ తనదైన శైలి చతురతను ప్రదర్శించే నైపుణ్యం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుందని చెప్పాలి. అంతేకాకుండా ఏబీఎన్ చెప్పాలనుకున్న అంశాన్ని ఆ లైన్ మేరకే కొనసాగేలా కూడా ఆయన షోను నిర్వహించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఉన్నట్టుండి ఆ షోలో వెంకట కృష్ణ ప్లేస్ లో మరో జర్నలిస్టు మంగళవారం నాటి ప్రోమోలో కనిపించారు. బుధవారం నాటి షోలో ఏకంగా ఆ కొత్త జర్నలిస్టు ప్రత్యక్షమైపోయారు కూదా.
ఇలా వెంకట కృష్ణ హోస్ట్ గా ప్రసారం అవుతున్న షోలో ఆయన కాకుండా వేరే జర్నలిస్టు కనిపించగానే…అరెరే వెంటక కృస్ణ ఏబీఎన్ ను వదిలేశారా? అంటూ అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి వెంకట కృష్ణ ఏబీఎన్ ను వీడే దిశగా చాలా రోజుల క్రితమే సంస్థకు చెప్పేశారని, నోటీస్ పీరియడ్ ముగిసేదాకా ఆ సంస్థలో కొనసాగుతున్నారని జర్నలిస్టు సర్కిళ్లలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలు నిజమేనన్నట్లుగా ఆయన స్థానంలో కొత్త జర్నలిస్టు ఏబీఎన్ తెరపై ప్రత్యక్షమయ్యారు. ఇదిలా ఉంటే… ఏధో ఓ కొత్త ఛానెల్ ప్రారంభం అవుతుండగా సదరు మీడియా హూస్ తో కలిసి పనిచేసేందుకు వెంకట కృష్ణ ఏబీఎన్ ను వదులుకున్నారని సమాచారం. అయితే ఆ కొత్త మీడియా ఎవరిదన్న విషయం మాత్రం తెలియరాలేదు.