వైసీపీలో ఏం చేయాలి? నాయకులు ఎలా ఉండాలి? ఏ సమయానికి ఎలా మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? ఇలా.. ఇవన్నీ కూడా.. సలహాదారులే నిర్ణయించేవారు. గతంలో రాజకీయ సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులు ఉండేవారు. వారు డిసైడ్ చేసేవారు. అయితే.. ఇప్పుడు వైసీపీ విపక్షంలోకి వచ్చింది. చాలా మంది సలహాదారులు వెళ్లిపోయారు. ఇక, ఉన్నవారు కూడా.. పార్టీలో అంతర్గతంగానే ఉంటున్నారు. కానీ.. ఇప్పుడు ఆ మిగిలిన నలుగురు సలహాదారుల ముచ్చట పార్టీలో ఆసక్తిగా మారింది.
సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యంగా మరోసారి చక్రం తిప్పుతున్నారన్న చర్చ సాగుతోంది. ఆయన ఇస్తున్న సలహాల మేరకే.. పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇది పార్టీకి తీవ్ర విఘాతంగా మారుతోందన్న చర్చ కూడాఉంది. తాజాగా శాసనసభ బడ్జట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. సభకు వైసీపీ డుమ్మా కొట్టింది. కానీ, మండలిలో మాత్రం ఒకింత పోరాటం కొనసాగుతోంది. కానీ.. ఇక్కడ ఎవరు మాట్లాడాలి? ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించాలన్న విషయం ఆసక్తిగా మారింది.
వాస్తవానికి వైసీపీ మండలి ఫ్లోర్ లీడర్‌గా ఉన్న బొత్స సత్యనారాయణ ఈ విషయాలు చూసుకోవాలి. ఆయన చెప్పిన వారు ప్రశ్నలు సంధించొచ్చు. లేదా.. ఆయనకు చెప్పి.. ఇతర నాయకులు కూడా చొరవ తీసుకోవచ్చు. కానీ.. ఈ విషయంలో ఓ కీలక మాజీ సలహాదారు జోక్యం చేసుకుని.. కొందరికి మాత్రమే అవకాశం వచ్చేలా వ్యవహరిస్తున్నారని మండలి లాబీల్లో వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. దీనిలో వాస్తవం ఎంత ఉందన్నది ముఖ్యం కాకపోయినా.. సలహాదారుల వ్యవహారం మాత్రం ముఖ్యంగా మారింది.
వాస్తవానికి.. సభలలో మాట్లాడే అవకాశం కోసం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎదురు చూస్తారు. ఈవిషయం లో కొందరు పోటీ కూడా పడతారు. కానీ ఇలాంటివారికి కూడా.. అవకాశం లేకుండా.. కొందరిని మాత్రమే ప్రత్యేకంగా ఎంపిక చేస్తున్నారని.. వారే మాట్లాడుతున్నారన్న వాదన సభ్యుల మధ్య వినిపిస్తుండడం గమనార్హం. ఇదేకనుక నిజమైతే.. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగి.. పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందన్నది గుర్తించాలి. ఏదేమైనా.. సలహాదారుల వ్యవహారం మరోసారి పార్టీని కుదిపేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates