వైసీపీకి ప్రతిపక్ష హోదాపై తేల్చేసిన చంద్రబాబు

అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిన్న చీకటి రోజు అని, గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డుపడిన తీరును ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ అంటే ఒక గౌరవమని, ఒక పవిత్ర దేవాలయం అని..కానీ,వైసీపీ సభ్యులు దానిని అపవిత్రం చేశారని మండిపడ్డారు. సరిగ్గా 11 గంటలకు జగన్ శాసన సభకు 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చిన కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి 11.11 కు వెళ్లిపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వం గౌరవ శాసన సభను కౌరవ సభగా మార్చిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. గౌరవ సభను గౌరవించలేని, సంస్కారం లేని పార్టీ వైసీపీ అని విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ దిగజారి మాట్లాడుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. తన 41 ఏళ్ల రాజకీయ జీవితంలో అలా అడిగిన తొలి వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలని, తాము కాదని మరోసారి గుర్తు చేశారు.

సభా సంప్రదాయాలను మరచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వస్తా అని చెప్పే వ్యక్తిని తొలిసారి చూస్తున్నానని అన్నారు.

దేశంలో ఎక్కడా జరగని విధంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ అడుతున్నారని చెప్పారు. 9వ సారి తాను ఎమ్మెల్యేగా సభకు వచ్చానని, బహుశా అది ఒక రికార్డు అని అన్నారు. కానీ, వైసీపీ సభ్యుల వంటి తీరు మరే సభ్యుల దగ్గర చూడలేదని గుర్తు చేసుకున్నారు.