ఎనుముల రేవంత్ రెడ్డి… సిసలైన రాజకీయాన్ని టీడీపీలో నేర్చుకుని కాంగ్రెస్ లో చేరిన గండరగండుడు. రేవంత్ వచ్చేదాకా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరమేనని చెప్పాలి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజీ దక్కి ఉండాల్సింది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్ లో పడిపోయిన కాంగ్రెస్ ఆ క్రెడిట్ ను ఆయనకే వదిలేసి చేేజేతులారా నష్టాన్ని కొని తెచ్చుకుంది. ఆ తప్పు తెలుసుకున్న తర్వాత అయినా.. రాష్ట్రంలో పుంజుకునే విషయాన్ని పట్టించుకోకుండా సాగింది. రేవంత్ రెడ్డి వచ్చాక గానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రాలేదు. సీనియర్ మోస్ట్ నేతలను పక్కకు నెట్టేసి… వారందరినీ తన బాటలో నడిచేలా చేసుకుని… నేరుగా వెళ్లి తెలంగాణ సీఎం కుర్చీ ఎక్కిన రేవంత్ నిజంగానే ధీరుడే.
అలాంటి సత్తా కలిగిన నేత అధికారంలో ఉంటే.. విపక్షాలకు ముచ్చెమటలు ఖాయమే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే కాబోలు.. ఇప్పుడు రేవంత్ కొడుతున్న దెబ్బలకు అటు బీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీ నేతలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అంశం ఏదైనా గానీ.. రేవంత్ తనదైన శైలి దూకుడు చూపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అయినా.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అయినా… తనకు అడ్డుగా వస్తున్నది ఇంకెవరైనా కూడా రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనతో పాటు ప్రస్తుతం కేంద్రంలో సాగుతున్న ఎన్డీఏ పాలన మీద రేవంత్ ఓ రేంజిలో సెటైర్లు పేలుస్తున్నారు. తన పేరు ఎత్తాలంటేనే అవతలి వారు జడిసిపోయేలా రేవంత్ సాగుతున్న తీరు కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ ను నింపుతోంది.
ఈ క్రమంలో రేవంత్ సాగిస్తున్న మాటల దాడికి తట్టుకోవడం అటు బీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీ నేతలకు సాధ్యం కావడం లేదు. అందుకే కాబోలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తనపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణకు అడ్డుపడ్డానని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తానెప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని కూడా ఆయన చెప్పారు. తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేవంత్ దూకుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నీరో చక్రవర్తిలా మారిపోయారని ఆయన అన్నారు. తన తండ్రి కేసీఆర్ ను విమర్శించడం తప్పించి రేవంత్ తెలంగాణకు చేసిందేమీ లేదని కూడా ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ దూకుడును తట్టుకోలేకపోతున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.