టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం మండలిలో టీడీపీ పక్ష నాయకుడిగా కూడా ఉన్న యనమల రా మకృష్ణుడు సేఫ్‌జోన్‌లోనే ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన పదవీ కాలం.. వచ్చే నెలతో ముగియ నుంది. దీంతో తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలో ఈయన సీటు కూడా చేరింది. అయి తే.. ఈయనను వదులుకునే అవకాశం చంద్రబాబుకు లేదని అంటున్నారు పార్టీ సీనియర్లు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల బిల్లు మండలికి వచ్చినప్పుడు.. యనమల సారథ్యంలో మండలిలో బాగానే ఫైట్ చేశారు.
అంతేకాదు.. మండలిని బలోపేతం చేయడంలోనూ.. వైసీపీకి అప్పట్లో చుక్కలు చూపించడంలోనూ యనమల కీలక రోల్ పోషించారు. ఇక, తాజాగా తన సొంత నియోజకవర్గం తునిలోనూ చక్రం తిప్పారు. అనేక ఇబ్బందులు వచ్చినా.. తుని స్థానిక సంస్థను టీడీపీ పరం చేయడంలో ఆయన విశేషంగానే పనిచేశారు. ఇవన్నీ ఇలా ఉంటే.. కూటమి సర్కారు వచ్చాక తనకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నప్పటికీ.. చంద్రబాబు ఇవ్వలేదు.
దీంతో యనమల అసంతృప్తితో ఉన్నారు. సుదీర్ఘకాలం టీడీపీతో ఉన్న అనుబంధం, పైగా సీనియర్ నాయకుడు.. కావడంతో చంద్రబాబు ఆయనను వదులుకునే ప్రయత్నం చేయరని.. మరోసారి ఆయనకు రెన్యువల్ చేస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే.. యనమల మరోసారి మండలికి ఎన్నిక కానున్నారు. ఇదిలావుంటే.. 2019 ఎన్నికలకు ముందు నుంచి కూడా.. టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన విజయవాడకు చెందిన వంగవీటి రాధాకు ఈ దఫా మండలి సీటు ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
కాపు కోటాలో కాకపోయినా.. పార్టీపై ఆయన చూపుతున్న ప్రేమ, అభిమానం వంటివి పనిచేస్తాయన్న చర్చ ఉంది. పైగా.. ఇప్పటి వరకు సుదీర్ఘ కాలంగా ఆయన చట్టసభలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను మండలికి పంపించే అవకాశం ఉందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. కానీ, లైన్‌లో మాత్రం విజయవాడకు చెందిన బుద్దా వెంకన్న, మైనారిటీ కోటాలో.. జలీల్ ఖాన్ వంటి వారు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.