రాజకీయాల్లోకి రావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఏదో రాజకీయ ప్రస్థానం ఉండి… రాజకీయాల్లో బాగా దెబ్బలు తిన్న కుటుంబాల వారు అయితే తప్పించి… రాజకీయాలు అంటే ఆసక్తి చూపని వారే ఉండరు. మరి ప్రస్తుతం రాజకీయాల్లోకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే వారికి బెటర్ ఆప్షన్ ఏది అన్న దానిపైనా ఓ ఆసక్తికర చర్చకు అయితే తెర లేసింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు సభ ప్రారంభం కాగానే… జరిగిన ఓ ఘటనను ఆధారంగా చేసుకుని పెద్ద ఎత్తున ఈ దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ వైపు వైసీపీలో ఏళ్ల తరబడి కష్ట పడుతున్నా రాని గుర్తింపు.. టీడీపీలో కేవలం నెలల వ్యధిలోనే దరి చేరిపోతుందన్న వాదనలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
మంగళవారం నాటి సభలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే….. సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు శిక్షణ పేరిట కూటమి సర్కారు కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియాలో కథనాలు వచ్చాయి. వీటి గురించి నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రస్తావించారు. దీంతో ఈ విషయాన్ని సభా హక్కుల సంఘానికి పంపిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు… విచారణ చేపట్టి సాక్షి మీడియాపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సాక్షి మీడియా .జగన్ కుటంబ ఆధ్వర్యంలో నడుస్తోన్న సంస్థ కదా.. అంటే అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమే. ఇంతటి ప్రాధాన్యం ఉన్న అంశాన్ని ప్రస్తావించేందుకు టీడీపీలో ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే కొత్తగా సభకు ఎన్నికైన జయసూర్యకు ఈ అవకాశాన్ని టీడీపీ ఇచ్చింది.
నందికొట్కూరులో టీడీపీ తరఫున మొన్నటి ఎన్నికల్లో జయసూర్య పోటీ చేయగా.. వైసీపీ నుంచి సుధీర్ అనే కొత్త నేత పోటీకి దిగారు. ఓటర్లు స్థానికుడు అయిన జయసూర్య వైపు మొగ్గి… ఎంత జగన్ సొంత జిల్లా కడపకు చెందిన వారైనా పొరుగు నేత సుధీర్ తమకు అక్కర్లేదంటూ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో గెలిచినంతనే జయసూర్య నియోజకవర్గంలో మంచి పట్టు సాధించే దిశగా కష్టపడుతున్నారు. పార్టీ నుంచి కూడా ఆయనకు మంచి సహకారమే అందుతోంది. ఈ క్రమంలోనే ఆయన సాక్షిలో వచ్చిన అసత్య కథనాలను ప్రస్తావించగానే… ఆ బాధ్యతను మీరే తీసుకుని ముందుకు సాగండి అంటూ టీడీపీ అధిష్ఠానం ఆయన భుజం తట్టింది. సాక్షిపై విచారణ జరిగి… ఆ మీడియాపై చర్యలకు ఆదేశాలు జారీ అయితే జయసూర్య రాజకీయ ప్రస్థానానికి తిరుగు ఉండదనే చెప్పాలి.
ఇక నందికొట్కూరు 2009లో ఎస్సీ రిజర్వ్ డ్ కాగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన లబ్బి వెంకటస్వామి విజయం సాధించారు. 2014 వచ్చేసరికి కాంగ్రెస్ అంతా వైసీపీలోకి చేరగా… వైసీపీ నుంచి లబ్బికి కాకుండా కొత్త అభ్యర్థి ఐజయ్యకు సీటు దక్కగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో ఐజయ్యను పక్కనపెట్టేసిన జగన్.. అర్థర్ అనే మరో కొత్త నేతకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో ఈ సీటులో స్థానికులే లేనట్లుగా కడప జిల్లాకు చెందిన దళితుడు సుధీర్ ను జగన్ బరిలోకి దింపారు. అంటే.. గడచిన 4 ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీ ఆ నియోజకవర్గం నుంచి నలుగురు అభ్యర్థులను మార్చిందన్న మాట. ఈ క్రమంలో ప్రాధాన్యం గురించి దేవుడెరుగు?.. రెండో సారి సీటు కోసమే అక్కడి వైసీపీ నేతలు తిప్పలు పడాల్సి వచ్చింది. అయితే టీడీపీ విషయంలో ఆ తరహా పరిస్థితి ఉండబోదని జయసూర్య ఉదంతమే చెబుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates