ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల పరంపర మరోసారి తెరమీదికి వచ్చింది. ఆయా హామీల్లో కీలకమైన వాటిని ఎప్పుడు అమలు చేస్తారంటూ . ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తరచుగా సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా ఆయా పథకాలను అమలు చేస్తా మని చెబుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. తాజాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
ఈ ప్రసంగంలో సూపర్ సిక్స్ పథకాల్లోని కీలకమైన రెండు అంశాలను ప్రస్తావించారు. మాతృవందనం పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద రూ.15000 చొప్పున మహిళల ఖాతాల్లో వేయనున్నామని పేర్కొన్నారు. అయితే.. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నప్పటికీ.. ఖచ్చితంగా డేట్ అయితే చెప్పకపోవడం గమనార్హం. ఇక, మరోది.. మెగా డీఎస్సీ. ఈ విషయాన్ని సైతం గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
త్వరలోనే మెగాడీఎస్సీ నియామకాలు చేపడతామని తన ప్రసంగంలో చెప్పారు. అంటే.. దీనిని బట్టి.. త్వరలోనే మెగా డీఎస్సీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు. వాస్తవానికి వీటికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అయితే.. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ విషయాన్ని సర్కారు వాయిదా వేస్తుండడం గమనార్హం. అయితే.. ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలోనూ పేర్కొన్నారు కాబట్టి మెగా డీఎస్సీపై కదలిక వచ్చే అవకాశం ఉంది.
ఇక, సంక్షేమ పథకాలను సమూలంగా మార్చి.. పేదలకు రూ.1000 చొప్పున పెంచి పింఛన్లు అందిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ ప్రస్తావించారు. ఇక, నైపుణ్యాభివృద్దికి పెద్దపీట వేస్తామని తరచుగా సీఎం చంద్రబాబు చెబుతున్న విషయం కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావనకు వచ్చింది. త్వరలోనే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు గవర్నర్ తెలిపారు. మొత్తంగా చూస్తే.. బడ్జెట్కు ముందు జరిగిన ఈ ప్రసంగంలో చంద్రబాబు వ్యూహాలు స్పష్టంగా కనిపించాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates