ఏ చిన్న అవకాశం దొరికినా… తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల సెటైరిక్ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చి… గవర్నర్ ప్రసంగం కూడా పూర్తి కాకుండానే సభ నుంచి వాకౌట్ చేసిన జగన్ తీరుపైనా ఆమె వ్యంగ్యాస్త్రాలను సంధించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది? అని ఆమె జగన్ ను సూటిగానే ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జగన్ తీరును తూర్పారబట్టడంతో పాటుగా అధికార కూటమి తీరును కూడా తప్పుబట్టారు.
రాష్ట్ర ప్రజలు ఛీకోడుతున్నా.. జగన్ తీరు మాత్రం మారడం లేదని షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల కంటే కూడా జగన్ కు ప్రతిపక్ష హోదానే ముఖ్యమైపోయిందని ఆమె విమర్శించారు. అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వాలు రద్దు అయిపోతాయన్న భయంతోనే కేవలం అటెండెన్స్ కోసమే సభకు వచ్చారా? అని కూడా నిలదీశారు. అయినా సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలంటే జగన్ కు ప్రతిపక్ష హోదానే కావాలా అని కూడా ఆమె ప్రశ్నించారు. ప్రజల శ్రేయస్సు కంటే కూడా జగన్ కు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపితమైందన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే.. జగన్ కు పదవుల మీద ఆశ లేదంటే మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కావాలన్నారు. అలా కాకుండా సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని ఆమె మరోమారు జగన్ ను డిమాండ్ చేశారు.
ఇక అధికార కూటమి తీరును ప్రశ్నించిన షర్మిల… గవర్నర్ ప్రసంగంలో పస లేదని విమర్శించారు. ఆ ప్రసంగంలో రాష్ట్రానికి దిశానిర్దేశం కూడా లేదన్నారు. గవర్నర్ ప్రసంగం మొత్తం అర్థ సత్యాలే ఉన్నాయని, పూర్తి అబద్ధాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీలపై స్పష్టమైన ప్రకటన లేదన్న షర్మిల… సంక్షేమం, పునరుజ్జీవం అంటున్నారే తప్పించి ఎప్పటి నుంచి అమలు అన్న స్పష్టతే లేదన్నారు. ఇప్పటిదాకా ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పించి… మిగిలిన 5 హామీల అమలుపై స్పష్టత లేదన్నారు. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారే తప్పించి… విజన్ 2047 దమ్ము ప్రసంగంలో కనిపించలేదన్నారు. ఈ 8 నెలల పాలన కాలయాపన తప్పించి ఎక్కడా కమిట్ మెంట్ కనిపించలేదని ఆమె విమర్శించారు. హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశనే మిగిల్చిందని ఆమె దుయ్యబట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates