ఏపీ అసెంబ్లీలో అధికార కూటమి ప్రచారం చేస్తున్నట్లుగా విపక్షం వైసీపీ సింగిల్ డే షోకే పరిమితం అయిపోయింది. సభలో తాము అడిగినట్టుగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా… ఈ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి హాజరైన జగన్.. గవర్నర్ తన ప్రసంగంలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని వ్యాఖ్యానించినంతనే సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నేరుగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన జగన్… అక్కడే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని జగన్ నిర్ణయించారు.
ఈ సమావేశంలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం. తాను ఇంకో 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని జగన్ అన్నారు. తనతో పాటు నడిచే వారే తన వారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సభలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో కూటమి సర్కారు లేదని ఆయన తెలిపారు. సభలో వైసీపీకి ఆ హోదా ఇవ్వకపోతే… ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుందామని ఆయన అన్నారు. ఈ కారణంగానే ఇకపై వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష హోదా లేకపోతేనేం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేద్దామని ఆయన పార్టీ నేతలతో అన్నారు. 2028 ఫిబ్రవరిలోనే జమిలి ఎన్నికలు వస్తాయని అంటున్నారని చెప్పిన జగన్… అప్పటిదాకా ప్రజా క్షేత్రంలోనే పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
జగన్ నుంచి ఈ వ్యాఖ్యలు వినిపించినంతనే.. అధికార పార్టీ వైసీపీ తీరు, జగన్ తీరుపై చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. అనర్హత వేటు తప్పించుకునేందుకే జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం సభకు వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడితో పాటుగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి వ్యాఖ్యలు నిజమేనన్నట్లుగా ఇకపై అసెంబ్లీకి వెళ్లరాదంటూ జగన్ నిర్ణయం తీసుకున్నారన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. మరోవైపు అనర్హత వేటు తప్పించుకునేందుకు జగన్ సోమవారం ఒక్క రోజు అసెంబ్లీకి వస్తారంటూ టీడీపీ అనుకూల మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి. ఆ కథనాలన్నీ నిజమేనని తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం చెప్పేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారని ప్రజలు భావిస్తే… వారి ఆశలపై జగన్ నీళ్లు చల్లేశారన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates