కబ్జా భూమి సరెండర్ తో పని అయిపోయినట్టేనా…?

భూకబ్జా అనేది నేరం. ఈ నేరానికి జీవిత కాలం పాటు జైలు శిక్ష విధించే దిశగా ఏపీలోని కూటమి సర్కారు సాగుతోంది. అంటే.. భూకబ్జాలకు పాల్పడినట్టుగా నేరం నిరూపితమైతే… దోషులకు ఏకంగా 14 ఏళ్ల జైలు శిక్ష తప్పదన్న మాట. మరి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నట్టుగా ఉంది. తాను భూకబ్జా చేసినట్లుగా తేలితే.. తాను కబ్జా చేసిన స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అంటున్నారు. సరే… నేరం రుజువు అయితే ఎలాగూ కబ్జాకు గురైన భూమి అటు ప్రభుత్వానికో, లేదంటే అసలైన యజమానుల వద్దకో చేరిపోతుంది. మరి భూ కబ్జాకు పాల్పడినందుకు ఎవరికి శిక్ష వేయాలి? ఆకేపాటి మాటలు విన్నంతనే చాలా మందికి ఇవే డౌట్లు వచ్చాయట.

గతంలో ఉమ్మడి కడప జిల్లా… ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రం రాజంపేట కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ఆకేపాటిపై పెద్దగా ఆరోపణలేమీ లేవనే చెప్పాలి. రాజంపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నా.. మిస్టర్ క్లీన్ గానే ఉన్నట్లు కడప జిల్లా వాసులు చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల విభాగానికి టీడీపీకి చెందిన రాజంపేట మండల అధ్యక్షుడు ఓ ఫిర్యాదు చేశారు. రాజంపేట మండలం ఆకేపాడు, మందపల్లి గ్రామాల పరిధిలోని 30 ఎకరాల సర్కారీ భూమిని ఆక్రమించి ఆకేపాటి ఎస్టేట్ పేరిట ఎమ్మెల్యే నిర్మాణాలు చేపట్టారని అందులో ఆయన ఆరోపించారు. దీనిని పరిశీలించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దీనిపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కార్యాలయం విచారణ బాధ్యతను రాజంపేట సబ్ కలెక్టర్ కు అప్పగించగా… దీనిపై ఇప్పటికే విచారణ కూడా పూర్తి అయిపోయినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆకేపాటికి సబ్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారట. దీంతో ఈ కథేంటి అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సబ్ కలెక్టర్ నుంచి తనకేమీ నోటీసులు రాలేదని ఆకేపాటి తెలిపారట. అంతటితో ఆగని ఆయన తన స్వగ్రామంలోనే ఇల్లు కట్టుకున్నానని చెప్పిన ఆయన… తన స్వగ్రామంలో మినహా జిల్లాలోని ఏ ఒక్క ప్రాంతంలోనూ తనకు భూములు లేవని తెలిపారట. ఈ సందర్భంగా తాను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపితమైతే.. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవచ్చని ఆకేపాటి అలా చెప్పుకుంటూ పోయారట. తాను ఎక్కడా భూ కబ్జాకు పాల్పడలేదని, తాను ఏ అధికారి ముందు విచారణకు హాజరయ్యేది లేదని కూడా ఆకేపాటి తేల్చి చెప్పారట.