వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలతో పాటు సామాన్య జనం కూడా ధైర్యవంతుడిగా చెబుతూ ఉంటారు. పార్టీ శ్రేణులు అయితే ఏకంగా పులివెందుల పులి అని, సింగిల్ గా వచ్చే సింహమని కీర్తిస్తూ ఉంటారు. తండ్రి చనిపోయిన తరుణంలో కేసులు మీద పడ్డా… వెన్నుచూపని ధీరుడిలా.. అధికార కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి… కేసులకు కూడా భయపడకుండా సాగిన నేతగా సామాన్య జనం జగన్ ను చూస్తారు. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా కూడా జగన్ ధైర్యస్తుడేనని ఒప్పుకోక తప్పదు కూడా. అలాంటి జగన్ ఇప్పుడు భయపడ్డారా? అన్నదిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లను గెలవడంతో జగన్ ఒకింత చిన్నబుచ్చుకున్నారని చెప్పక తప్పదు. అప్పటిదాకా 151 సీట్లతో బలీయంగా కనిపించిన తాను…ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిపోవడం ఏమిటన్న ప్రశ్న ఆయనను బాగానే వేధించింది. అయితే జనం తీర్పును కాదనలేరు కదా. ఐదేళ్లు నెట్టుకుని వస్తే… 2029 ఎన్నికల్లో సత్తా చాటుదామని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈలోగానే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కదా. వాటికి 10 మందిని వెంటేసుకుని వెళితే… అసలే తనపై పీకల్లోతు కోపంతో ఉన్న అదికార కూటమి తనను హేళన చేస్తుందని, తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారేమోనన్న భావనతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని కూడా నిర్ణయించుకున్నారు.
అయితే ఆరు నెలల పాటు వరుసగా సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేస్తామంటూ ఇటు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాటుగా అటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పదే పదే చెబుతున్న వైనం… చివరాఖరుకు పులివెందులకు ఉప ఎన్నిక తప్పదంటూ ఇటీవల ఓ రేంజిలో జరుగుతున్న ప్రచారం చూసి జగన్ నిజంగానే భయపడ్డారన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అసలే అతి తక్కువ మంది ఎమ్మెల్యేలతో ఉన్న పార్టీ… ఆపై తన స్థానానికే ఉప ఎన్నిక వస్తే… అసలు ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉన్న ఈ విఫరిణామాలను నిరోధించడానికే జగన్ పూనుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఆయన తీర్మానించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి సభకు రాని ఏ నేతపైనా ఇప్పటిదాకా అనర్హత వేటు పడిన దాఖలానే లేదు. అంతెందుకు 2014 ఎన్నికల్లో ఓడిపోయిన జగన్… సభను బహిష్కరిస్తున్నట్లు సభలోనే ప్రకటించి… బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన సభకు వెళ్లిందే లేదు. వైసీపీ సభ్యులు కూడా 2019 ఎన్నికలు ముగిసేదాకా కూడా సభలో అడుగుపెట్టిందీ లేదు. ఆ తర్వాత టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా విపక్షంలో ఉండగా… తనకు సభలోనే అవమానం జరిగిందని సభనే బాయికాట్ చేసేశారు. వైసీపీ అధికారంలో ఉంటే అసెంబ్లీ కౌరవ సభగా మారిందని వ్యాఖ్యానించిన ఆయన సభను గౌరవ సభగా మార్చాకే అడుగుపెడతానంటూ శపథం చేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి గెలిచేంత వరకు ఆయన సభలో అడుగే పెట్టలేదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అసలు సభకే వెళ్లడం లేదు. ఇలా సభకు దూరంగా ఉన్న ఏ నేతపైనా ఇప్పటిదాకా అనర్హత వేటు పడిన దాఖలానే లేదు. అయితే అనర్హత దిశగా సాగుతున్న ప్రచారంతో జగన్ నిజంగానే భయపడిపోయారన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.