వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు… పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం తీరిగ్గా కన్నబాబు ఆ కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. ఆడంబరాలు, ఆర్భాటాలకు అల్లంత దూరాన ఉండే కన్నబాబు… రీజనల్ కో ఆర్డినేటర్ గా పదవీ బాధ్యతల స్వీకరణను కాస్తా ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో తన తొలి సమావేశంగా మార్చివేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన చాలా మంది నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వెరసి ఈ కార్యక్రమం గ్రాండ్ ఈవెంట్ గా జరిగింది.
అయితే ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ఓ ముగ్గురు కీలక నేతలు మాత్రం ఎంతసేపు వేచి చూసినా కనిపించని వైనం ఆసక్తి రేకెత్తించింది. ఆ ముగ్గురు నేతలు ఎవరంటే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం. బొత్స ప్రస్తుతం శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన అమరావతిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఉన్నారని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎలాంటి పదవుల్లో లేని.. కనీసం ఎమ్మెల్యేలుగా కూడా లేని ధర్మాన, తమ్మినేనిలు ఈ సమావేశానికి ఎందుకు దూరంగా ఉన్నారన్న దానిపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.
2019లో వైసీపీ అధికారంలోకి రాగా… తమ్మినేని సీతారాంకు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కింది. ఆ పదవితో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు కూడా. అయితే…మొన్నటి ఎన్నికల్లో తమ్మినేని ఓటమిపాలు కాగా… తన కుమారుడిని రాజకీయాల్లోకి దింపే పనిలో ఆయన నిమగ్నం అయి ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. తన పుత్రరత్నాన్ని వైసీపీతో కాకుండా ఇతర పార్టీల ద్వారా రాజకీయ తెరంగేట్రం చేయిద్దామన్న దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక ధర్మాన కూడా తన రాజకీయ వారసుడి ఎంట్రీ కోసం వ్యూహాల్లో నిమగ్నమయ్యారని… ఆయన కూడా తమ్మినేని బాటలోనే ఇతర పార్టీల వైపు చూస్తున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి గైర్హాజరీ వైసీపీలో ఎన్నెన్నో విశ్లేషణలకు ఆస్కారం ఇచ్చింది.