భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా కొనసాగుతున్నారు. మోదీ బృందంలో ఉన్నవారంతా కూడా వారి వారి విభాగాల్లో లబ్ధ ప్రతిష్టులే. జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ అయితేనేం… ప్రిన్సిపల్ సెక్రటరీ టూ పీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ కుమార్ మిశ్రా అయితేనేం… కేబినెట్ లో అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, జై శంకర్, కిరణ్ రిజిజు.. ఇలా ఎవరిని తీసుకున్నా.. అంతా సత్తా కలిగిన వారే. ఇప్పుడు ఈ టీంలో మరో ‘శక్తి’మంతుడు చేరిపోయారు. ఆయన మరెవరో కాదు…మొన్నటిదాకా రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా పనిచేసి రిటైర్ అయిన శక్తికాంత దాస్.
ప్రధాన మంత్రికి రెండో ముఖ్య కార్యదర్శి(సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టూ పీఎం)గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ శక్తికాంత దాస్ నియామకానికి సంబంధించి శనివారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులో దాస్ కొనసాగింపునకు సంబంధించి ఆ కమిటీ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించింది. మూడో పర్యాయం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పదవిలో ఉన్నంత కాలం ఆయనకు దాస్ రెండో ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే ఈ టెర్మ్ లో మోదీ పీఎంగా ఉన్నంతకాలం దాస్ సదరు పోస్టులో కొనసాగుతారన్న మాట.
ఒరిస్సాకు చెందిన శక్తికాంత దాస్… ఢిల్లీలోని ప్రసిద్ధ సెయింట్ స్టీఫెన్ సన్ కళాశాలలో చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన దాస్… తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారిగా విధుల్లోకి చేరిపోయారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో పలు హోదాల్లో పనిచేసిన దాస్… అత్యదిక కాలం పాటు కేంద్ర సర్వీసుల్లోనే కొనసాగారు. వాణిజ్య వ్యవహారాలు, రసాయనాలు, ఆర్థిక శాఖల కార్యదర్శిగా పనిచేసిన దాస్… అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, ఎన్డీబీ వంటి సంస్థల్లో భారత ప్రతినిధిగా సేవలు అందించారు. బ్రిక్స్ సహా పలు అంతర్జాతీయ కూటముల్లో ఆయన భారత ప్రతినిధిగా సత్తా చాటారు. ఈ క్రమంలోనే ఆయనకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవి దక్కగా… తాజాగా ఏకంగా మోదీ టీంలోనే కీలక సభ్యుడిగా చేరిపోయారు. చదివింది హిస్టరీనే అయినా.. ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టు కలిగిన అధికారిగా దాస్ గుర్తింపు సంపాదించుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates