అమ‌రావ‌తికి మ‌రో మ‌ణిహారం… ఓఆర్ ఆర్‌కు కేంద్రం ఓకే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌రో మ‌ణిహారం ల‌భించింది. నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యం లో కీల‌క‌మైన బాహ్య‌వ‌ల‌య ర‌హ‌దారి(ఔట‌ర్ రింగ్ రోడ్డు)ని మ‌రింత విస్త‌రించేందుకు ప్ర‌తిపాదించిన ఫైలుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి శ‌నివారం అర్ధ‌రాత్రి దాటాక కేంద్రం గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో రాజ‌ధాని నిర్మాణంలో కీల‌క‌మైన ఓ ఆర్ ఆర్ నిర్మాణ ప‌నులు శ‌ర వేగంగా జ‌ర‌గ‌నున్నాయి.

ఏంటీ ర‌హ‌దారి..

రాజ‌ధాని ప్రాంతాన్ని.. కృష్ణా, గుంటూరు, ప‌ల్నాడు, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల‌తో క‌లుపుతూ ఈ ఔట‌ర్ రింగు రోడ్డును నిర్మించ‌నున్నారు. ఈ ప‌రిధిలోని ప్రాంతం మొత్తం దాదాపు రాజ‌ధానిగానే భావిస్తారు. ఈ మొత్తం ఔట‌ర్ రింగు రోడ్డు.. 190 కిలో మీట‌ర్లు ఉంటుంది. దీంతో విజ‌య‌వాడ తూర్పు బైపాస్‌ను ర‌ద్దు చేసి.. పూర్తిగా ఆయా ప్రాంతాల‌ను ఈ ఔట‌ర్ ప‌రిధిలోకి తీసుకువ‌స్తారు. దీనికి ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీకారం తెల‌ప‌గా.. తాజాగా కేంద్రం ఆమోద ముద్ర కూడా ల‌భించింది.

భూసేక‌ర‌ణ‌

కేంద్రం ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో ఈ ఔట‌ర్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఐదు జిల్లాల ప‌రిధిలో భూసేక‌ర‌ణ చేప‌డ‌తారు. సోమ‌వారం దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. భూములు ఇచ్చే వారిని స్వ‌చ్ఛందంగా ఆహ్వానించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఒక‌వేళ వివాదాల భూములు ఉంటే.. వాటిని స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను క‌లెక్ట‌ర్ల‌కు, జాయింట్ క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించింది. సాధ్య‌మైనంత వేగంగా భూసేక‌ర‌ణ చేయాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది.

ఈ ద‌ఫాలోనే పూర్తి!

కూట‌మి హ‌యాంలోనే ఈ ఓఆర్ ఆర్‌ను పూర్తిచేయాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని మంత్రివ‌ర్గం కొన్నాళ్ల కింద‌టే నిర్ణ‌యం తీసుకుంది. త‌ద్వారా రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ వేగం పుంజుకోవ‌డంతో పాటు, పెట్టుబ‌డులు కూడా త్వ‌ర‌గా వ‌స్తాయ‌న్న అంచ‌నా వుంది. ఇక‌, భూసేక‌ర‌ణ నుంచి నిర్మాణం వ‌ర‌కు కూడా.. కేంద్ర‌మే భ‌రించ‌నుంది. అయితే.. భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌, మ్యుటేష‌న్‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించాల్సి ఉంటుంది.