ఎట్టకేలకు వైసీపీ నాయకులు బయటకు వస్తున్నారు. ఎన్నికల ఫలితం తర్వాత.. వైసీపీ 11 స్థానాలకు జారిపోయిన తర్వాత.. ఇప్పుడిప్పుడే విధాన పరమైన అంశాలతో వైసీపీ నాయకులు బయటకు రావడం ప్రారంభించారు. తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి.. కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. జగన్ బయటకు రాకూడదా? అని ప్రశ్నించారు. అంతేకాదు .. జగన్ బయటకు వస్తే.. కూటమి సర్కారు తప్పులు బయట పడతాయని ఆందోళన కనిపిస్తోందన్నారు.
అంతేకాదు.. రైతులను పరామర్శించేందుకు వచ్చిన జగన్‌కు భద్రత కల్పించలేదన్న వెంకట్రామిరెడ్డి.. ఇది తప్పుకాదా? అని నిలదీశారు. పైగా ఇల్లీగల్ యాక్టివిటీ అని పేరు పెట్టడాన్ని కూడా ఆయన ఖండించారు. జగన్ బయటకు రాకూడదన్న ఏకైక ఉద్దేశంతోనే భద్రతను తగ్గించారని.. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యా నించారు. మరోవైపు.. ఉత్తరాంధ్రలోనూ.. సీనియర్లు బయటకు వస్తున్నారు.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తాజా పరిణామాలపై స్పందించారు. అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా రియాక్ట్ అయ్యారు. జగన్‌కు అనుకూలంగా వారు మాట్లాడారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదని వ్యాఖ్యానించారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అయితే.. తమ నాయకుడు ప్రజా నాయకుడని.. ఆయనకు ఎవరి భద్రతా అవసరం లేదని.. ప్రజలే జగనను కాపాడుకుంటారని వారు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే.. వైసీపీలో గత 9 నెలలుగా నెలకొన్న స్తబ్దత వీడిపోయిందని.. నాయకులు ఇప్పుడిప్పుడే లైన్‌లో పడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఇది మున్ముందు వరకు కొనసాగుతుందా? లేక.. ఏదో కంటితుడుపుగా మీడియా ముందుకు వచ్చారా? అనేది రాబోయే రోజుల్లోనే తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates