గురు శిష్యుల మ‌ధ్య జ‌ల జ‌గ‌డం.. రేవంత్ దూకుడు.. !

మ‌రో రెండు మాసాల్లో(మే నుంచి) వేసవి కాలం ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో నీటి అవ‌స‌రం ఎంత ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా క‌రువు ప్రాంతాల్లో సాగు, తాగు నీటికి ఎద్ద‌డి మ‌రింత పెరుగుతుంది. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు ముందుగానే అలర్టు కావ‌డం తెలిసిందే. తాజాగా ఈ విష‌యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మ‌రింత దూకుడుగా ఉన్నారు. అవ‌స‌రమైతే.. ఏపీతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌ని ఆయ‌న ప‌రోక్షంగా తేల్చి చెప్పారు. ఇదే జ‌రిగితే.. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మ‌ధ్య జ‌ల జ‌గ‌డం మ‌రింత పెర‌గ‌నుంది.

కేంద్రంలో కూట‌మిగా ఉన్న టీడీపీ స‌ర్కారుకు.. జ‌లాల విష‌యంలో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తోంద‌న్న వాద‌న ఆది నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే వేస‌విలో నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు, నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లకు విశేష అధికారాలు ఇచ్చారు. ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల విష‌యంలో ఏపీతో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్ప‌డం ద్వారా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు తీసుకునే ఏ నిర్ణ‌యంపైనైనా పోరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

టెలిమెట్రీకి సై!

వాస్త‌వానికి ఇరు రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న త‌ర్వాత జ‌ల వివాదాలు కొత్త కాదు. గ‌తంలో కేసీఆర్‌, జ‌గ‌న్‌ల మ‌ధ్య రాజ‌కీయంగా అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ.. జ‌లాల విష‌యంలో వారు రాజీప‌డ‌ని ధోర‌ణిలోనే ముందుకు సాగారు. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబుకు.. రేవంత్ కావాల్సిన మ‌నిషే అయినా.. త‌న శిష్యుడేన‌ని ఆయ‌న భావించినా.. నీటి విష‌యంలో ఎక్క‌డా రాజీ ధోర‌ణిలేకుండా రేవంత్ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే రానున్న 3 నెలలు అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చొరవ తీసుకునేలా కలెక్టర్లను ఆదేశించారు. త‌ద్వారా.. చుక్క‌నీటిని కూడా వ‌దులు కోకుండా..రేవంత్ వేస్తున్న వ్యూహానికి చంద్ర‌బాబు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

ఏం ఆశిస్తున్నారు?

  • శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో ఏపీ వాటా మాత్ర‌మే వినియోగించుకునేలా అప్రమత్తంగా ఉండ‌డం.
  • ఆయా జ‌లాల్లో నిర్ణీత కోటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేయ‌డం.
  • దీనికి గాను టెలిమెట్రీ విధానం అమలుకు రెడీ కావ‌డం. అవ‌స‌ర‌మైతే.. నిధులను కూడా భారీగా ఖ‌ర్చు చేయ‌డం.
  • టెలీమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేఆర్ఎంబీకి లేఖ రాయడం.
  • నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘంపైనే పెట్ట‌డం ద్వారా ఏపీని క‌ట్ట‌డి చేయ‌డం.
  • నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించేలా ముందుగానే లేఖ‌లు రాయ‌డం. ఫిర్యాదులు కూడా చేయ‌డం.