తప్పు తెలుసుకున్న జగన్.. పవన్ ను వదిలేశారా?

కొన్నిసార్లు అంతే. తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళ.. చేయకూడని తప్పులు చేయటం.. వాటికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవటం చేస్తుంటారు. అధికారంలో ఉన్న వేళ.. తాము చేసే తప్పుల్ని గుర్తించేందుకు ఇష్టపడరు సరి కదా.. ఆ దిశగా ఎవరైనా సలహాలు.. సూచనలు ఇస్తే వాటిని పెద్దగా పట్టించుకోవటం చాలా సందర్భాల్లో జరిగేదే. అలాంటి తీరును ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారా? అంటే అవునని చెప్పాలి.

తనకు రాజకీయంగా పెద్ద వైరం లేని జనసేనాని పవన్ కల్యాణ్ ను జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రధాన ప్రశ్న. కదిలించి కంప మీద ఏసుకున్నట్లుగా.. తమతో రాజకీయ వైరం లేని పవన్ ను కెలుక్కోవటం ద్వారా తమకు భారీ డ్యామేజ్ జరిగిందన్న విషయాన్ని ఎన్నికల ఫలితాల్ని చూసిన తర్వాత జరిగిన మదింపులో పవన్ ఇష్యూను ప్రత్యేకంగా చర్చకు వచ్చినట్లు చెబుతారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు -పవన్ కల్యాణ్ కు మధ్య దూరాన్ని తగ్గించిన క్రెడిట్ జగన్మోహన్ కు ఇవ్వటం కనిపిస్తుంది. నిజానికి సరైన వ్యూహాన్ని అనుసరించి ఉంటే.. చంద్రబాబుతో తగినంత దూరాన్ని పవన్ మొయింటైన్ చేసి ఉండేవారిన చెబుతారు. అందుకు భిన్నంగా అదే పనిగా జనసేనానిని కెలకటం.. ఘాటు విమర్శల్ని సంధించటం ద్వారా తమపై లేని కసిని పవన్ లో రగిలించిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్న మాటను కొందరు వైసీపీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో షేర్ చేసుకోవటం గమనార్హం.

చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసి.. పవన్ కల్యాణ్ పై విధాన పరమైన అంశాల్లో చేసే తప్పుల్ని ఎత్తి చూపటం ద్వారా పవన్ తనను టార్గెట్ చేసే అవకాశం ఉండేది కాదంటున్నారు. అయినప్పటికీ పవన్ టార్గెట్ చేసుకున్నట్లు అయితే.. అతనికే నష్టం వాటిల్లేదన్న మాట వినిపిస్తోంది. అందుకు భిన్నంగా పవన్ ను వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేసే వ్యూహం ఎన్నికల్లో ఎదురుదెబ్బకు ఒక కారణంగా చెబుతారు.

అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పుల్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే పనిగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. మాట వరసకు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను పల్లెత్తు మాట అనని వైనం కనిపిస్తుంది. వ్యూహాత్మకంగా కూడా ఇది మంచి ఎత్తుగడగా చెబుతున్నారు. చంద్రబాబు మాదిరి పాలనలో పవన్ కల్యాణ్ తప్పులు చేస్తే.. విడిచి పెట్టకుండా ఆ అంశాల్ని మాత్రమే ప్రస్తావించటం ద్వారా తన ఇమేజ్ ను జగన్ పెంచుకోవచ్చని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.