వైసీపీ పాలనలో ఏపీలో దుర్మార్గ పాలన సాగిందని, దౌర్జన్య కాండ రాజ్యమేలిందని, గిట్టని వారిపై బెదిరింపులకు అయితే అడ్డే లేదని టీడీపీ సహా వైసీపీ వైరి వర్గాలు గొంతెత్తి అరిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీ పాలన సాంతం దురాగతాలతోనే సాగిందని కూటమి పార్టీలు నెత్తీనోరు మొత్తుకున్నాయి. ఆ ఆరోపణలు ఏ మేర నిజమో తెలియదు గానీ… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చెబుతున్న విషయాలను చూస్తుంటే… నాటి పాలన దుర్మార్గంగానే సాగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సూర్యనారాయణ వైసీపీ పాలనలో తనకు ఎదురైన బెదిరింపులను బయటపెట్టారు.
వైసీపీ పాలనలో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం, పాత పెన్షన్ విధానంలో కొత్త పెన్షన్ విధానం అమలు వంటి అంశాలపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దఫదఫాలుగా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో ఉద్యోగుల సంక్షేమం పట్ల రాజీ పడేది లేదని సూర్యనారాయణ తదితరులు బహాటంగానే ప్రకటించారు. ఈ క్రమంలో సూర్యనారాయణకు ప్రభుత్వ వర్గాల నుంచే కాకుండా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల నుంచి కూడా బెదిరింపులు ఎదురయ్యాయని నాడే ఆయన తెలిపారు. తాజాగా గురువారం నాటి మీడియా సమావేశంలో నాడు తనకు ఎదురైన బెదిరింపులను ఆయన కళ్లకు కట్టారు.
2023 జూన్ 1న రాత్రి 7.50 గంటలకు నాడు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేస్తున్న పీఎస్ఆర్ ఆంజనేయులు నుంచి వీడియో కాల్ వచ్చిందని సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటల కంతా నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇంటికి వెళ్లి… ఆయన ముందు పూర్తిగా సరెండర్ కావాలని బెదిరించారన్నారు. లేని పక్షంలో 9.30 గంటలకంతా మీరు ఉండరని కూడా పీఎస్ఆర్ చెప్పారన్నారు. ఉండరంటే.. చంపేస్తారా? అని తాను ప్రశ్నించానన్న సూర్యనారాయణ… మీరో ఆలిండియా సివిల్ సర్వెంట్ అయి ఉండి ఓ ఉద్యోగ సంఘం నేతగా ఉన్న తనను ఇలా బెదిరిస్తారా? అని ప్రశ్నించానన్నారు. దీనికి గాను ఇదంతా తన ప్లాన్ కాదని, ఎస్ఆర్కే గారు చెప్పమంటే చెబుతున్నానని కూడా చెప్పిన పీఎస్ఆర్ ఫోన్ కట్ చేశారని తెలిపారు. వీడియో కాల్ చేసిన సందర్భంగా పీఎస్ఆన్ ఓ కానిస్టేబుల్ ను తన ఇంటికి పంపి… తానుంటున్న గదిలో తాను ఒక్కడినే ఉన్నానని రూడీ చేసుకున్నాక ఈ తరహా బెదిరింపులకు దిగారని తెలిపారు. సూర్యనారాయణ చెప్పిన ఈ విషయాలతో కూడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.