దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఢిల్లీ నూతన సీఎంగా బీజేపీ నేత రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కీలక నేతలను బీజేపీ ఆహ్వానించింది. బీజేపీ ఆహ్వానాలతో ఎన్డీఏ మిత్రపక్షాల అధినేతలు అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరికీ వేదికపై వరుసగా కుర్చీలు వేశారు. సరిగ్గా 12.15 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వేదిక మీదకు రాగానే… ఎన్డీఏ మిత్రపక్షాల నేతలంతా లేచి నిలుచుని మోదీకి నమస్కారం చేశారు.
ఈ సందర్భంగా అందరికీ వరుసగా నమస్కారం చేస్తూ సాగుతున్న మోదీ… జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్దకు వచ్చినంతనే ఆగిపోయారు. పవన్ కు నమస్కారం చేయడానికి బదులుగా మోదీ ఆయనకు షేక్ హ్యాండిచ్చారు. అంతేకాకుండా పవన్ తో ఆయన ఒకింత సేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి పవన్ సనాతన వస్త్రధారణలో హాజరయ్యారు. ఈ డ్రెస్సింగ్ పైనే పవన్ తో మోదీ సంభాషించినట్లుగా సమాచారం. పవన్ దుస్తులను చూపుతూ మోదీ మాట్లాడగా.. మోదీ మాటలకు పవన్ పడి పడి నవ్విన దృశ్యాలు ఆసక్తి రేకెత్తించాయి. ఇక పవన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన మోదీ… ఆయనకు ఇరువైపుల ఉన్న నేతలతో పాటు… పవన్ వెనుక ఉన్న టీడీపీ యువనేత, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి నమస్కారం పెట్టి ముందుకు సాగారు.
ఇక పవన్ కు షేక్ హ్యాండ్ తర్వాత ముందుకు సాగిన మోదీ… అలా వెళుతూ… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలకు నమస్కారం పెడుతూ సాగారు. జేపీ నడ్డా పక్కన నిలబడ్డ టీడీపీ అధినే, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్దకు వచ్చినంతనే… చంద్రబాబుకు నమస్కారంతో పాటుగా మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పవన్ మాదిరే చంద్రబాబుతోనే మోదీ ముచ్చటించారు. చంద్రబాబుకు ఓ పక్క నడ్డా… మరోవైపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నా… మోదీ మాత్రం చంద్రబాబుతోనే మాట కలపడం గమనార్హం. మొత్తంగా వేదికపై అంతమంది నేతలున్నా… ఏపీకి చెందిన చంద్రబాబు, పవన్ లకు మాత్రమే మోదీ షేక్ హ్యాండిచ్చి వారికి తాను ఎంత ప్రాధాన్యం ఇస్తున్నానన్న విషయాన్ని తన చేతల్లో చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates