రాజకీయాల్లోకి రావడం.. పోవడం.. అనేది నాయకుల ఇష్టం. అయితే.. మారుతున్న కాలంలో.. నాయకుల ఇష్టాలతో పాటు పార్టీలకు అవసరాలు కూడా ముఖ్యంగా మారాయి. పార్టీల అవసరం ఉంటేనే.. నాయకులకు ఎంట్రీ ఉంటోంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక పరంగా పార్టీలకు దన్నుగా మారుతున్న వారిని పార్టీలు ఎప్పుడూ వదులుకునే పరిస్థితిలేదు. ఉదాహరణకు ఏలూరులో వైసీపీనాయకుడు ఆళ్ల నాని చేరిక విషయంలో టీడీపీలో తర్జన భర్జన జరిగింది. నిజానికి స్థానిక నాయకులు పెద్దగా ఇష్ట పడలేదు. దీంతో నాని చేరిక వ్యవహారం.. ఎప్పటికప్పుడు వాయిదా పడింది.
అయినప్పటికీ.. సామాజికంగా, ఆర్థికంగా కూడా నాని బెటర్ అని భావించడంతో చంద్రబాబు చివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన చేరిక జరిగిపోయింది. ఇక, వైసీపీలోనూ ఇలాంటి చేరికలే ఉన్నాయి. ఇటీవల సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. నిజానికి ఎవరూ కూడా ఓడిపోయిన పార్టీలో చేరేందుకు సిద్ధపడరు. కానీ, ఆయన వ్యూహాలు వేరే ఉండడంతో వైసీపీ కూడా ఎస్సీ సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో సాకే ఫ్యాను కిందకు చేరిపోయారు. సో.. ఇటు నాయకుల అవసరం.. అటు పార్టీల అవసరం రెండూకలిసి వస్తే.. నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు పార్టీలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి.
ఇక, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విషయానికి వస్తే.. ఆయన వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం గత రెండు వారాలుగా జోరుగా సాగింది. నిజానికి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత.. మౌనంగా ఉన్నా.. తర్వాత తర్వాత రాజకీయ విశ్లేషకుడిగా మారారు. జగన్ హయాంలో అయితే.. ఆయన పాలనను కూడా మెచ్చుకున్నారు. కరోనా సమయంలో దేశంలోని ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. కానీ, ఇక్కడ ఏపీలో మాత్రం ప్రజలు సేఫ్‌గా ఉన్నారని.. ఆదాయాలు కూడా పెరిగాయని చెప్పారు.
ఈ పరిణామాలతో జగన్ గూటికి ఉండవల్లి చేరిపోతారని అప్పట్లోనూ అనుకున్నారు. ఇక, తాజాగా సాకే శైలజానాథ్ వంటివారు చేరడంతో ఈ ప్రచారానికి మరింత ఊపొచ్చింది. అయితే… ఉండవల్లి మాత్రం చేరలేదు. ఇక, టీడీపీలో చేరినా అభ్యంతరం లేని ఉండవల్లికి మిత్రుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరో బాంబు పేల్చారు. అయితే.. ఉండవల్లి తాజాగా తాను ఏ పార్టీలోనూ చేరడం లేదన్నారు. వాస్తవానికి ఉండవల్లి చేరుతారా? లేదా? అనేది పక్కన పెడితే.. సామాజికంగా, ఆర్థికంగా కూడా..ఉండవల్లికి రాజకీయంగా పుంజుకునే అవకాశం ఇప్పుడు లేదు. దీంతో పార్టీలు సైతం.. ఆయనను చేర్చుకునేందుకు పెద్దగా ఇష్టపడడం లేదన్న చర్చ ఉంది. అందుకే.. ఉండవల్లికి ఛాన్స్ లేకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates