వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. తాజాగా జగన్.. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కూటమి సర్కారుపైనా.. చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించారు. దీనిని ఉటంకిస్తూ.. షర్మిల విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీ కి వెళ్లే తీరిక లేని జగన్.. అండ్ కో.. జైలుకు వెళ్లి జైలు పక్షులను పరామర్శించే తీరిక ఉందని ఎద్దేవా చేశారు. అక్రమాలు చేసిన వారిని.. అన్యాయాలుచేసిన వారిని పరామర్శించే సమయం ఉన్న జగన్.. ప్రజల సమస్యలకు మాత్రం స్పందించడం లేదన్నారు.
“అసెంబ్లీకి వెళ్లరట. కానీ, ప్రెస్‌మీట్లు పెట్టి పురాణాలు చెబుతారట!“ అని షర్మిల ఎద్దవా చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లాలని .. 11 మందిని గెలిపించిన ప్రజల తరఫున కూటమి సర్కారును ప్రశ్నించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేయ డం ఇష్టంలేకే.. అసెంబ్లీకి వెళ్లాలంటే.. వెనుకాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి పురాణం మాత్రం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు సభకు వెళ్లకుండా మారాం చేయడం ఇక్కడే చూస్తున్నామని వ్యాఖ్యా నించారు. ఇలాంటి వారికి ప్రజల మధ్య తిరిగేందుకు కూడా అర్హత లేదని షర్మిల నిప్పులు చెరిగారు.
“ప్రజల సమస్యలపై మాట్లాడే నైతికత వాళ్లకు అసలే లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారైనా అసెంబ్లీకి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నా“ అని షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాలంటే సభకు వెళ్లాలని.. లేదంటే.. భయపడుతున్నారని భావించాల్సి ఉంటుందని చురకలు అంటించారు. “బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరయ్యే దమ్ము లేకుంటే మీకు పదవులు వేస్ట్.. వెంటనే రాజీనామాలు చేయండి“ అని వైసీపీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు.
కూటమిపైనా దూకుడు!
మరోవైపు.. కూటమి సర్కారుపైనా షర్మిల వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్‌ను అమలు చేయకుండా సర్కారు కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా.. ఇప్పటికీ వీటిని అమలు చేయడం లేదన్నారు. అదేమంటే 90 కారణాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. “సూపర్ సిక్స్ పథకాలకు ఈ సారి బడ్జెట్‌లో అయినా.. నిధులు కేటాయించి.. మీ మాటను నిలబెట్టుకోండి“ అని సీఎం చంద్రబాబుకు షర్మిల సూచించారు. లేకపోతే.. అధికారం కోసం ఇచ్చిన హామీలనే ప్రజలు భావిస్తారని వ్యాఖ్యానించారు.