క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారాన్ని చూసిన తర్వాత అందరు ఇదే అనుకుంటున్నారు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ అన్నీ సీట్లలోను ఒంటిరిగా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేంత వరకు ఎన్డీఏ కూటమిలోనే ఎల్జేపీ కూడా ఉండేది. అయితే కూటమి అధినేత, ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ తో ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు గొడవలు మొదలయ్యాయి.
కారణాలు ఏవైనా ఎన్డీఏ కూటమిలో ఉండలేకపోవటంతో చిరాగ్ బయటకు వచ్చేశాడు. చిరాగన్ ను కూటమిలోనే ఉంచేందుకు బీజేపీ తరపున జరిగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో వేరు కుంపటి పెట్టుకున్న ఎల్జేపీ మొత్తం అన్నీ సీట్లోను పోటి చేయాలని డిసైడ్ చేసింది.
అందుబాటులోని సమాచారం ప్రకారం బహుశా ప్రస్తుత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనే ప్రొజెక్టు కావాలని చిరాగ్ అనుకున్నట్లున్నారు. తన తండ్రి, కేంద్రమంత్రిగా పనిచేసిన రామ్ విలాస్ పాశ్వాన్ మద్దతుతో ఎన్నికల్లో ఈజీగా గెలిచిపోవచ్చని అంచనాలు వేసినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా ఎన్నికల వేడి బాగా అంటుకున్న తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రామ్ విలాస్ ఈమధ్యే చనిపోయారు. తండ్రి అకాస్మత్తుగా చనిపోవటం చిరాగ్ పెద్ద దెబ్బనే చెప్పాలి. అయితే తండ్రి మృతి తాలూకు సానుభూతి తనకు ఓట్ల రూపంలో వచ్చిపడతాయని వేసిన అంచనా కూడా ఫెయిల్ అయ్యేట్లే ఉంది.
ఎలాగంటే రామ్ విలాస్ కు బీహార్ దళితుల్లో తిరుగులేని ఇమేజి ఉన్న మాట వాస్తవమే. కానీ అదే పేరు, పట్టు చిరాగ్ కు లేదు. పైగా చిరాగ్ వయస్సులో కూడా (37) మరీ చిన్నవాడే కావటంతో ఓటర్లు, దళితుల్లో సీనియర్ నేతలు కూడా పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. పైగా ఇఫుడు ఎన్డీఏ కూటమిలో సభ్యుడు కూడా కాదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రీ పోల్ సర్వేల్లో ఎల్జేపీ అసలు విషయం బయటపడింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తీరుపై లోక్ నీతి-సీఎస్డిఎస్ జరిగిన ఓ సర్వేలో ఎల్జేపీ గురించి జనాలు పెద్దగా పట్టించుకోవటం లేదని తేలింది. పోటీ ప్రధానంగా ఎన్డీఏ, యూపీఏ కూటముల మధ్యే ఉంటుందని చాలామంది ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
చిరాగ్ అమలు చేస్తున్న ప్లాన్ కూడా బెడిసికొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అర్ధమైపోతోంది. అదేమంటే జేడీయూ అభ్యర్ధులు పోటి చేస్తున్న 122 సీట్లలో బలమైన అభ్యర్ధులను రంగంలోకి దింపాలని చిరాగ్ ప్లాన్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ పోటి చేస్తున్న 121 సీట్లలో ఎక్కువ చోట్ల వీక్ క్యాండిడేట్లను రంగంలోకి దింపాలన్నది చిరాగ్ ప్లాన్. ఎంత గోప్యంగా ప్లాన్ చేసినా అభ్యర్ధులను చూసిన తర్వాత చిరాగ్ మనసులోని ప్లాన్ ఏమిటో ప్రత్యర్ధులకు, జనాలకు అర్ధంకాకుండా ఉంటుందా ?
ఇటువంటి అనేక రకాలైన వ్యూహాలతో చివరకు చిరాగే అబాసుపాలయ్యేట్లున్నాడు. తాజాగా జరిపిన సర్వేలో ఓటర్ల అభిప్రాయం ప్రకారం ఎల్జేపీకి 2-6 సీట్ల మధ్య వస్తే ఎక్కువన్నట్లుగా తేలింది. ఇదే నిజమైతే చిరాగ్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావటంతో పాటు తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్న విషయం స్పష్టమైపోతుంది. పర్వాలేదు ఎన్నికల తర్వాతయినా క్షేత్రస్ధాయిలోని వాస్తవాలను జాగ్రత్తగా గమనించి నిజాయితీగా విశ్లేషించుకుంటే భవిష్యత్తులో మంచి నేతగా ఎదిగే అవకాశాలు చిరాగ్ కు బాగానే ఉన్నాయి.