టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఢిల్లీలో గురువారం జరిగే ఓ కీలక కార్యక్రమంలో పాలుపంచుకునేందుకే ఆయన ఈ పర్యటనకు వెళుతున్నారు. అందుకోసం గురువారం జరగాల్సి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని కూడా ఆయన వాయిదా వేశారు. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే… కేబినెట్ భేటీని రీషెడ్యూల్ చేస్తారని సమాచారం. అయినా కేబినెట్ భేటీని వాయిదా వేసుకుని మరీ చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారంటే.. బీజేపీ నిర్వహించతలపెట్టిన కార్యక్రమం పెద్దదే అయి ఉంటుంది కదా. అంత లేనిది బాబు కేబినెట్ భేటీని వాయిదా వేసుకుని ఢిల్లీ వెళ్లరు కదా.
ఇటీవలే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా… బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 27 ఏళ్ల క్రితం తన చేజారిన ఢిల్లీ సీఎం పీఠాన్ని బీజేపీ తిరిగి దక్కించుకుంది. దీంతో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ అధిష్ఠానం తీర్మానించింది. ఈ క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కీలక నేతలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఆ పార్టీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలను కలిగిన పార్టీ టీడీపీనే కదా. అందులోనూ చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే సీనియర్ మోస్ట్ నేతగా ఉన్నారు. చంద్రబాబు పాలనను ఆదర్శ పాలనగా స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే కీర్తిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ నిర్వహించే ఏ కార్యక్రమం కూడా చంద్రబాబు లేకుండా జరగడం లేదు.
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ బీజేపీ అధినాయకుల నుంచి చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే మీరు తప్పనిసరిగా రావాల్సిందేనంటూ చంద్రబాబును కోరారట. దీంతో చంద్రబాబు తన కేబినెట్ భేటీని వాయిదా వేసుకోక తప్పలేదట. ఇటీవల ముంబైలో జరిగిన మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు స్పెషల్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ లెక్కన బీజేపికి సంబంధించిన ఏ కీలక కార్యక్రమమైనా చంద్రబాబు లేకుండా జరగదన్న ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.