వైసీపీ అధినేత జగన్ వివాదాల సుడిలో మునిగిపోయారు. మాజీ ఎమ్మెల్యే, కుట్ర, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ వచ్చిన జగన్.. రాజకీయ వ్యాఖ్యలతోపాటు.. పోలీసులను కేంద్రంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు వైసీపీ నేతలపై వేదింపులకు పాల్పడే పోలీసులను సప్త సముద్రాల అవతల ఉన్నా.. పట్టుకుని తీసుకువచ్చి బట్టలూడదీసి నిలబెడతామని జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. రిటైర్ అయినా.. వదిలి పెట్టేది లేదని తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వ్యవహారంపై గంటల వ్యవధిలోనే ఏపీ పోలీసుల సంక్షేమ సంఘం స్పందించింది. మాజీ సీఎం జగన్‌పై సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని, మీ తాకాటు చప్పుళ్లకు ఎవరూ బెదిరిపోరని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పోలీసులంటే.. ఏమనుకుంటున్నారని జగన్‌ను నిలదీశారు. పోలీసులను బట్టలూడదీసి నిలబెడతానని వ్యాఖ్యానించడం ద్వారా.. మీ స్థాయిని మీరే తగ్గించుకుని.. పలుచన అవుతున్నారని జనకుల నిప్పులు చెరిగారు. పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడం ఏం రాజకీయమని ప్రశ్నించారు.
“రాజకీయాల్లోకి మేం రావడం లేదు. కానీ, మీరు(జగన్) చేసిన వ్యాఖ్యలతో మా మనసులు కలత చెందుతున్నాయి. మమ్మల్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు మానుకోండి. ఎవరిని మీరు బట్టలూడదీసి నిలబెడతారు? చట్టాన్ని పరిరక్షించేవాళ్లనా? ఇలా మాట్లాడుతూ.. పోతే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని మీకు తెలియదా?“ అని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇప్పుడున్న పోలీసులు 8 నెలల కిందట ఉన్న వైసీపీ సర్కారులో పనిచేసిన వారేనన్న విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలని కూడా జనకుల పేర్కొన్నారు. నాడు.. అద్భుతం.. నేడు వివాదంగా వ్యవహరించాల్సిన అవసరం పోలీసులకు లేదన్నారు.
మీ కెందుకు సెల్యూట్ చేయాలి?
కాగా.. జగన్ జైలు వద్దకు వచ్చినప్పుడు పోలీసులు సెల్యూట్ చేయలేదన్న వైసీపీ నేతల విమర్శలకు కూడా జనకుల శ్రీనివా సరావు తగిన విధంగా సమాధానం చెప్పారు. చట్టాన్ని గౌరవించేవారికే పోలీసులు సెల్యూట్ చేస్తారని.. చట్టంపైనా..పోలీసులపైనా నోరు పారేసుకునేవారికి ఎందుకు సెల్యూట్ చేయాలని ఆయన ప్రశ్నించారు. చట్టం, ధర్మం, న్యాయం, సత్యానికి సంకేతాలైనా నాలుగు సంహాలకు మాత్రమే పోలీసులు సెల్యూట్ చేస్తారని నొక్కిచెప్పారు. జగన్ చేసిన వ్యాఖ్యలు పోలీసులను, వారి కుటుంబాలను కూడా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయని.. తక్షణమే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేకపోతే.. న్యాయపోరాటం తప్పదని జనకుల తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates