దక్షిణాది రాష్ట్రాల్లో కులగణనను పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో కర్ణాటక ముందున్నా.. అక్కడ పూర్తిస్థాయిలో కులగణన పూర్తి కాలేదు. కానీ, తెలంగాణలో మాత్రం.. దీనిని పట్టుబట్టి ముందుకు నడిపించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మంచిమార్కులే పడ్డాయి. పడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి దూకుడుగానే ముందుకు సాగారు. అనుకున్న విధంగా ఆఘమేఘాలపై కుల గణన పూర్తి చేశారు.
అయితే.. ఈ విషయంలో ఆశించిన గ్రాఫ్ మాత్రం రేవంత్ రెడ్డికి రాలేదనే చెప్పాలి. పైగా.. గ్రామీణ, నగర స్థాయిలో కుల గణన తర్వాత.. డిమాండ్లు పెరిగిపోయాయి. ఇప్పటి వరకు కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైన పదవులు.. తమకు కావాలంటూ.. బీసీ, ఎస్సీ వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. మంత్రి వర్గ విస్తరణ నుంచి.. నామినేటెడ్ పదవుల పంపకం వరకు దీని ఆధారంగానే చేయాల్సి ఉంటుంది.
తద్వారా.. ఇతర సామాజిక వర్గాల పరిస్థితి ఎలా ఉన్నా..రెడ్డి సామాజిక వర్గానికి రేవంత్ దూరమయ్యే అవకాశం ఉంటుందన్నది తాజాగా విశ్లేషకులు చెబుతున్న మాట. ఆర్థికంగా బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నిన్నటి వరకు రేవంత్ రెడ్డితో కొనసాగింది. కానీ, ఇప్పుడు కుల గణన తర్వాత.. రెడ్డి వర్గం నుంచి రేవంత్‌కు మద్దతు నానాటికీ జారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏమో.. రేపు బీసీని ముఖ్యమంత్రి చేస్తే.. ఏం జరుగుతుందో? అనే చర్చ వారిలో పెరుగుతుండడం గమనార్హం.
వీటికి తోడు.. ప్రతిపక్షాల నుంచి కూడా కులగణనను అడ్డు పెట్టుకుని రేవంత్‌ను కట్టడి చేసే వ్యూహాలు కూడా తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే.. బీజేపీ, బీఆర్ ఎస్‌ల నుంచి ఆ దిశగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కులగణనను కేవలం పేపర్లకే.. నివేదికలకే పరిమితం చేస్తున్నారంటూ.. బీఆర్ ఎస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఇక, బీజేపీ 52 శాతం మంది పైగా బీసీలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్యను ఎందుకు తగ్గించారన్న చర్చను తెరమీదికి తెచ్చింది. వెరసి..కుల గణన కారణంగా.. రేవంత్‌రెడ్డికి ప్రత్యేకంగా వచ్చిన లబ్ధి కంటే కూడా.. సమస్యలు, సవాళ్లు పెరిగాయన్నది వాస్తవమని చెబుతున్నారు.