వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు పొలిటికల్ కష్టాలు తీరడం లేదు. ఒకటి వదిలే ఒకటి ఆమెను పట్టిపీడిస్తున్నాయని అంటున్నారు ఆమె సానుభూతి పరులు. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో సొంత పార్టీలో నే ఎగస్పార్టీతో ఎదురీత ఈదారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఓ రేంజ్‌లో దూకుడుగా ముందుకు సాగిన రోజా.. అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. జగన్ కు మద్దతుగా అసెంబ్లీలో భారీ ఎత్తున గళం వినిపించారు. ఇంత చేస్తే.. గత ఎన్నికల అనంతరం .. పార్టీ అధికారంలోకి వచ్చినా.. వస్తుందని అనుకున్న మంత్రి పదవి జారిపోయింది.
ఇది తొలి దెబ్బ అని అప్పట్లో రోజాపై ప్రచారం సాగింది. తన సామాజిక వర్గానికి చెందిన జిల్లా నాయకుడు తనకు అడ్డంకిగా మారారని .. ఓసందర్భంలో మనసులో మాటను దాచుకోలేక వెల్లడించేశారు. ఆ తర్వాత చాన్నాళ్లకు ఏపీఐఐసీ చైర్మన్ గిరీ తెచ్చుకున్నా.. ఈ సంతోషం కూడా మూడు పూటలు నిలవలేదు. తన నియోజకవర్గంలో తనను ఎదిరించే వారు లేరనుకున్న తరుణంలో తనకు ఎగస్పార్టీ మొదలైంది. కేజే కుమార్ దంపతులు రోజాపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వీరి వెనుక కూడా సదరు నాయకుడే ఉన్నాడనేది రోజా ఆరోపణ. అయినప్పటికీ.. బయటకు చెప్పలేని పరిస్థితి.
ఎలాగోలా తట్టుకుని వస్తున్నారు. అయితే, ఇప్పుడు మరో ఎదురు దెబ్బ బాగా గట్టిగానే తగిలిందని అంటున్నారు రోజా అనుచరులు. ఇప్పటి వరకు తన నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయాలన్నా.. తనే స్వయంగా చేయించుకునేవారు. లేదా ప్రభుత్వానికి నేరుగా విన్నవించేవారు. కానీ, ఇప్పుడు నగరి నియోజకవర్గాన్ని తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ(తుడా)లోకి విలీనం చేశారు. దీంతో నగరి నియోజకవర్గంపై తుడా ఆధిపత్యం పెరుగుతుంది. పోనీ.. తుడాలో ఎవరున్నారు? అని ఆరాతీస్తే.. ఇప్పటి వరకు తనకు ఎదురు దెబ్బలు తగలడానికి కారణమైన సదరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడే ఉండడంతో రోజాకు దిమ్మతిరిగి పోయిందని అంటున్నారు.
ఇక, ఇప్పుడు తన నియోజకవర్గంలో ఏం చేయాలన్నా.. తుడా నిర్ణయమే కీలకం. అంటే.. పరోక్షంగా తాను డమ్మీ అయినట్టేనని ఆమె నిర్ణయానికి వచ్చేశారు. ఏ చిన్న పనికావాలన్నా.. తుడాను కోరాల్సిందే. పోనీ వద్దులే.. తుడా లేదు.. అందామా? జనాగ్రహం తప్పదు. నగరిని తుడా చేర్చడంపై ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజాకు పొలిటికల్ కష్టాలు మరింతగా పెరిగాయనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. మరి ఎలా దూసుకుపోతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates