వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలుకు వెళ్లారు. ఇటీవలే అరెస్టై జైల్లో ఉన్న తన పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మె్ల్యే వల్లభనేని వంశీ మోహన్ తో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన జగన్… అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంతో పాటుగా అధికార యంత్రాంగానికి కూడా భారీ హెచ్చరికలు జారీ చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని చెప్పిన జగన్… అప్పుడు తప్పులు చేసిన అధికారులతో పాటుగా వారిని ప్రోత్సహించిన టీడీపీ నేతలను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా జగన్ నోట నుంచి బట్టలూడదీసి నిలబెడతాం అంటూ ఓ రేర్ కామెంట్ వినిపించింది. అంతేకాకుండా రిటైర్ అయిపోయి తప్పించుకుందామనుకునే వారిని కూడా వదిలిపెట్టబోమన్న జగన్… రిటైర్ అయిన వారు సప్త సముద్రాల ఆవల ఉన్నా రప్పిస్తామని… చట్టం ముందు వారిని నిలబెట్టి చట్టబద్ధంగానే శిక్షలు పడేలా చేస్తామని చెప్పారు.
ఈ సందర్బంగా వంశీపై టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. టీడీపీ నేత పట్టాభిరాం స్వయంగా రంగంలోకి దిగి వంశీని అనరాని మాటలు అన్నారని… వంశీని రెచ్చగొట్టేలా గన్నవరం వెళ్లి వైసీపీ కార్యాలయం మీదకు దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు ప్రతిస్పందించి… టీడీపీ కార్యాలయంపైకి దాడికి యత్నించాయన్నారు. అయితే ఈ దాడిలో వంశీ పాల్గొన్నట్టుగా ఎక్కడా లేదని జగన్ తెలిపారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల్లో గానీ… టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదులో గానీ… సత్యవర్థన్ నుంచి పోలీసులు సేకరించిన స్టేట్ మెంట్ లో గానీ… ఎక్కడా వంశీ పేరే లేదని జగన్ తెలిపారు. అయినా కూడా వంశీపై కక్షగట్టిన చంద్రబాబు… ఈ కేసులో వంశీని 71వ నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయించారని ఆరోపించారు. వంశీ తప్పు చేయకున్నా కూడా అరెస్ట్ అయ్యారని.. అసలు ఈ వ్యవహారంలో వంశీ తప్పే లేదని కూడా జగన్ చెప్పారు.
రాష్ట్రంలో కూటమి సర్కారు దుర్మార్గ పాలన సాగిస్తోందని చెప్పిన జగన్… ప్రస్తుతం రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో జరుగుతున్న ఎన్నికలే నిదర్శనమన్నారు. పిడుగురాళ్ల, తుని, తిరుపతి, పాలకొండ పురపాలికల ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆయన ఆరోపించారు. పిడుగురాళ్లలో ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ సీటును గెలవని టీడీపీ… అందులో వైస్ చైర్మన్ పోస్టును ఎలా దక్కించుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడూ టీడీపీనే అధికారంలో ఉండదన్ జగన్… వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. ఈ విషయాన్ని చట్టాన్ని కాపాడే అధికారులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పోలీసులు తమ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయాలన్న జగన్… అందుకు విరుద్దంగా టీడీపీ నేతలకు సెల్యూట్ చేసే అధికారులను మాత్రం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జగన్ వెంట పార్టీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, వంశీ సతీమణి పంకజ శ్రీ తదితరులున్నారు.