తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పదవిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశం వేదికగా రేవంత్ సీఎం పదవితో పాటుగా భవిష్యత్తులో బీసీలకు దక్కనున్న ప్రాధాన్యతపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐధేళ్లు రేవంతే సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్యానించిన మహేశ్… ఈ ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే… బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత సీఎం పదవి చేపడతారని ఆయన చెప్పడం గమనార్హం.
తన సీఎం పదవిపై ఇదివరకే రేవంత్ రెడ్డి ఇదే దిశగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు తాను రెడ్డి సీఎంగా చివరి నేతను అయినా పరవాలేదు అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీనే ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న రేవంత్… అందుకు తానేమీ బాధ పడేది కూడా లేదని తేల్చి చెప్పారు. రేవంత్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చిన రోజుల వ్యవధిలోనే మహేశ్ కుమార్ గౌడ్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కుల గణన నేపథ్యంలో రేవంత్ ఆ తరహా వ్యాఖ్యలు చేయగా… ఇప్పుడు మహేశ్ కూడా అదే తరహాలో స్పందించడం గమనార్హం.
అయినా తాజా ప్రెస్ మీట్ లో మహేశ్ కుమార్ గౌడ్ ఏమన్నారన్న విషయానికి వస్తే… బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. ఏదో ఒక రోజున తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతారన్న మహేశ్.. అది కూడా కాంగ్రెస్ పార్టీలోనే అవుతారని అన్నారు. రానున్న ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో బీసీలు సీఎం కాలేదు కాబట్టే… రాహుల్ గాంధీ ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీసీలే సీఎం అవుతారన్న మహేశ్… ఈ ఐదేళ్ల పాటు సీఎంగా రేవంతే కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates