ఈ నెల 28 లేదా మార్చి 1న ఏపీ వార్షిక(2025-26) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. దీనిపై అన్ని వర్గాలలోనూ ఆశలు మెండుగా ఉన్నాయి. విద్యార్థుల నుంచి గృహిళుల వరకు, రైతుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు.. కేటాయింపులపై ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.
మరీ ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలపై నిధులు ఏరేంజ్‌లో కేటాయిస్తోందనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంపై ఇటు కూటమి పార్టీల్లోనూ.. అటు సాధారణ ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.
ప్రధానంగా మూడు పథకాలకు ఈ దఫా తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్టు తెలిసింది. గత ఏడాదిఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో.. కీలకమైనవి మూడు ఉన్నాయి.
1) మాతృవందనం, 2) రైతులకు అన్నదాత సుఖీభవ, 3) నిరుద్యోగ భృతి. అదేవిధంగా ఆడబిడ్డ నిధి కూడా ఉంది. ఇవన్నీ కూడా.. సొమ్ములతో ముడిపడిన వ్యవహారాలే. దీంతో ఎనిమిది నెలలు గడిచినా.. వీటిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయింది.
తాజాగా ప్రవేశ పెట్టే బడ్జట్ ఏప్రిల్ నుంచి అమలు కానున్న నేపథ్యంలో వచ్చే ఏడాదిలో అయినా.. ఈ పథకాలను అమలు చేయాలని ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. మరీ ముఖ్యంగా విపక్షాల నుంచి కూడా.. కొంత మేరకు విమర్శలు ప్రారంభమయ్యాయి.
దీనిని దృష్టిలో ఉంచుకున్న కూటమి ప్రభుత్వం.. మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రధానంగా మహిళలకు వరంగా మారే.. మాతృవందనం పథకాన్ని అమలు చేయనున్నారు.
అదేవిధంగా రైతులను మెప్పించేందుకు అన్నదాత సుఖీభవ కింద.. ఏటా ఇస్తామన్న రూ.20 వేలను ఇవ్వనున్నారు. అయితే.. దీనిలో కేంద్రం ఇస్తున్న 6000 వేల రూపాయలు మినహాయించి.. మిగిలిన మొత్తాన్ని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్టు సమాచారం. అలాగే.. నిరుద్యోగ భృతి కోసం కూడా.. నిధుల కేటాయింపు జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా.. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో మెరుపులు ఖాయమని తెలుస్తోంది.