ప్రతిపక్షం వైసీపీకి కీలకమైన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి గుంటూరు. ఈ జిల్లాలో గత ఆరేళ్లుగా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుని మరీ రాజకీయాలను దూకుడు పెంచారు. పల్నాడులోని వారికే మంత్రులుగా కూడా జగన్ అవకాశం ఇవ్వడం గమనార్హం.
ఇద్దరు మంత్రులు ఉంటే.. ఇద్దరూ పల్నాడుకు చెందిన వారే ఉండేవారు. వైసీపీకి అలాంటి బలమైన జిల్లాగా ఉన్న పల్నాడులో ఇప్పుడు పిడుగు పడింది. గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ ఇప్పుడు దానిని వదులుకోవాల్సి వచ్చింది.
తాజాగా జరిగిన పిడుగురాళ్ల మునిసిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. గతంలో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న వారంతా.. ఇప్పుడు కూటమికి జై కొట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే యరపతి నేని శ్రీనివాసరావు కీలకంగా మారడం గమనార్హం.
ఆయన ఎంట్రీతో వైసీపీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు. దీంతో గత నాలుగు రోజులుగా వాయిదా పడుతున్న పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నికను తాజాగా నిర్వహించారు. ఈ క్రమంలో అందరూ.. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గా ఉన్నం భారతికి జై కొట్టారు.
పిడుగురాళ్ల 30వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న ఉన్నం భారతికి కౌన్సిలర్లు మద్దతు పలకడంతో ఆమె ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 2022లో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. దీంతో వైసీపీ చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి.
అయితే.. తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటోంది. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే పిడుగు రాళ్లలోనూ పరిణామాలు మారిపోవడం గమనార్హం.